– పారిశ్రామికవేత్తలతో ముఖాముఖిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ఒత్తిడి చేయోద్దని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతోనే ఉన్నదని చెప్పారు. పరిశ్రమలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నదనీ, దీనివల్ల రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి ఫెడరేషన్ హౌస్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుద్దీకరణ పనులు జరిగాయనీ, ఫలితంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలు మెరుగయ్యాయని వివరించారు. 2014కు ముందు పారిశ్రామిక వేత్తలు ఎంత ధర అయినా చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా, మెరుగైన ఫలితాలు ఉన్నాయనీ, దీనికి సీఎం కేసీఆర్ దార్శనికతే కారణమని చెప్పారు.