నవతెలంగాణ-చేగుంట
2010 కన్నా ముందు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయు లకు సీనియార్టీ ప్రతిపాదికన పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని తపస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ మాట్లాడుతూ ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందుటకు టెట్ 2 ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం పదోన్నతి పొందబోయే సీనియర్ ఎస్‌జిటి ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయిందన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ ఇంతవరకు ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వలన ఇప్పటికిప్పుడు సీనియర్ ఎస్ జి టి ఉపాధ్యాయులు టెట్ 2 ఉత్తీర్ణత సాధించలేరు కాబట్టి 2010 కన్నా ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించుటకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఆర్టిఈ చట్టం వచ్చింది 2009లో అని, 2010 కంటే ముందు టెట్ తప్పనిసరి అని ఆర్ టి ఇ చట్టంలో లేదన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని, కావున అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికుల నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, తపస్ రాష్ట్ర బాధ్యులు దుబాషి భాస్కర్ ఆర్.వి.రామారావు, తపస్ చేగుంట, మసాయి పేట మండలల అధ్యక్షులు రావుల వెంకటేష్, రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.