ప్రజాపోరాటాన్ని ఆపొద్దు

ప్రజాపోరాటాన్ని ఆపొద్దు– ఆప్‌ మంత్రిని పరామర్శించిన బృందాకరత్‌, అఖిలేశ్‌ యాదవ్‌
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని ఆపొద్దని, ప్రజాసమస్యలపై జరిగే ఉద్యమాలకు అండగా ఉంటామని సీపీఐ (ఎం) నాయకురాలు బృందాకరత్‌ భరోసానిచ్చారు. న్యూఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ క్యాబినెట్‌ మంత్రి అతిషిని ఆమె బుధవారం పరామర్శించారు. ఢిల్లీ నీటి సమస్యపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన అతిషి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలైన విషయం విదితమే. ఈనేపథ్యంలో సమాజ్‌వాద్‌పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా మంత్రి అతిషిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి అతిషి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆస్పత్రికి వచ్చినట్టు తెలిపారు. ఆప్‌ మంత్రి అతిషికి ధైర్యం మాత్రమే కాదు… ప్రజల కోసం ఎలా పోరా డాలో తెలుసని అన్నారు. ఢిల్లీ నీటి సమస్య పరిష్కారం కోసం ఆమె నిరంతరం పోరాడుతూనే ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం చాలా వివక్ష చూపిందని, ఢిల్లీ సీఎంకు అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. బీజేపీకి ముప్పు కలిగించే వ్యక్తులపై సీబీఐ, ఈడీని ప్రయోగిస్తున్నారని, ఆ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love