కాకమ్మ కథలు వద్దు

Don't want Kakamma stories– ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులే దొరకడం లేదా?
– అధికారుల నియామకంపై కేంద్రాన్ని నిలదీసిన పార్లమెంటరీ కమిటీ
– రొటీన్‌ సమాధానాలు వద్దని చురక
న్యూఢిల్లీ : అత్యున్నత స్థాయి అధికారుల పోస్టులలో నియమించేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులే దొరకడం లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. ఎస్సీ, ఎస్టీలలో అర్హులైన అభ్యర్థులు లేనందునే అత్యున్నత పదవుల భర్తీలో వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించలేకపోతున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న కార ణాలను తోసిపుచ్చుతూ ‘రొటీన్‌’ సమాధానాలు వద్దని చురక వేసింది. ఎస్సీ, ఎస్టీలలో అన్ని అర్హతలు కలిగిన వివేకవంతులైన అభ్యర్థులు ఉన్నారని తెలిపింది. ఈ విషయంలో తీసు కున్న చర్యలే మిటో తెలియ జేస్తూ మూడు నెలలలో నివే దిక అందజే యాలని సూచించింది. బీజేపీ సభ్యుడు కిరిత్‌ ప్రేమ్‌జీ భారు సోలంకీ నేతృత్వంలోని 30 మంది సభ్యుల కమిటీ అందజేసిన నివేదికను లోక్‌సభ ముందు ఉంచారు. రిజర్వేషన్‌ విధాన రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పాత్రపై పార్లమెంటరీ కమిటీ నివేదికను రూపొందించింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7% రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ వివిధ స్థాయిలలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది.
నియామకాల విషయంలో ప్రస్తుతం ఉన్న అసమానతలను తగ్గించి, ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలించాలని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖను కమిటీ ఆదేశించింది. ఇందుకోసం తీసుకున్న చర్యల నివేదికను మూడు నెలలలో అందజేయాలని సూచించింది. ‘ఎస్సీ, ఎస్టీ తరగతులలో సరైన అభ్యర్థులు లేకపోవడం వల్లనే ఛైర్మన్‌, సభ్యుడు వంటి అత్యన్నత స్థాయి అధికారుల పోస్టులను వారితో భర్తీ చేయలేకపో తున్నామని చెబుతున్నారు. ఇలాంటి రొటీన్‌ సమాధానాలను అంగీకరిం చేందుకు మేము సిద్ధంగా లేము. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలలో ఉన్నత చదువులు చదివిన, వివేకవంతులైన, అర్హులైన అభ్యర్థులు అందుబాటులో ఉన్నారు’ అని స్పష్టం చేసింది.
కమిటీ సూచనలు ఇవే
కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నిస్పాక్షిక అంచనా కోసం పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల పేర్లను వెల్లడించకుండా వారికి ‘ప్రత్యేక ఐడీ సంఖ్య’ను ఇవ్వాలని చెప్పింది. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించవద్దని సూచించింది.
దీనివల్ల ఆయా సామాజిక వర్గాల వారిపై వివక్ష ప్రదర్శించే అవకాశం ఉండదని తెలిపింది. రిజర్వేషన్‌ విధానాలను అర్థవంతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చట్టం చేసే వరకూ అందుకోసం ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి, వాటిని భర్తీ చేసేందుకు ప్రత్యేక నియామకాల ప్రక్రియ చేపట్టాలని సూచించింది.
ప్రాతినిధ్యం పెరిగినా…
‘అత్యున్నత స్థాయిలో ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఖ్య 2017తో పోలిస్తే 2020 నాటికి 458 నుండి 550కి పెరిగింది. డిప్యూటీ సెక్రటరీ లేదా డైరెక్టర్‌ స్థాయిలో నియామకాలు కూడా ఆ కాలంలో 423 నుండి 509కి పెరిగాయి. జాయింట్‌ సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్రటరీ, సెక్రటరీ వంటి సీనియర్‌ స్థాయి పోస్టుల భర్తీలో మాత్రం పెద్దగా పెరుగుదల లేదు. అదనపు కార్యదర్శి పోస్టులు 90 మంజూరైతే 12 మందిని, జాయింట్‌ సెక్రటరీ పోస్టులు 242 మంజూరైతే 90 మందిని మాత్రమే ఎస్సీ, ఎస్టీల నుండి నియమించారు. డిప్యూటీ సెక్రటరీలు, డైరెక్టర్ల స్థాయిలో 509 పోస్టులు మంజూరైతే కేవలం 79 మంది ఎస్సీ, ఎస్టీ అధికారులను మాత్రమే నియమించారు’ అని కమిటీ ఎత్తిచూపింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ యూనిట్లు, ప్రభుత్వ బ్యాంకులలో డైరెక్టర్ల బోర్డులలో ఎస్సీ, ఎస్టీ సభ్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, కొన్నింటిలో అసలే లేరని కమిటీ తెలిపింది. దీనివల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారి భాగస్వామ్యం లేకుండా పోతోందని చెప్పింది. ప్రభుత్వంలోని సీనియర్‌ పోస్టులలో అధికారుల నియామకాన్ని డిప్యుటేషన్‌పై చేపడుతున్నామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ‘రొటీన్‌’ సమాధానాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.

Spread the love