– సాంకేతిక సమస్యలతోనే మాఫీ కాలేదు
– పొరపాట్లు సరి చేసి అర్హులందర్నీ రుణవిముక్తుల్ని చేస్తాం
– ఆగస్టు 14న రెండు లక్షల మాఫీ వైరాలో సీఎం ప్రారంభిస్తారు :మంత్రి తుమ్మల వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కోరారు. సాంకేతిక సమస్యలతోనే 30వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. పొరపాట్లను సరి చేసిన అర్హులందర్నీ రుణవిముక్తి చేస్తామని పునరుద్ఘాటించారు. రుణమాఫీ కానీ రైతులు తమ వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టుగానే రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 14న వైరా పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు వ్యవసాయ, ఉద్యాన, ఆగ్రో, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, విత్తనాభివృద్ధి సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టి రూ.7వేల కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు. గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.