ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం..

– కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు
– పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్లను అందుబాటులో ఉంచాలి
– రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలి
– కేంద్రానికి లేఖ రాస్తాం.. : మంత్రి హరీశ్‌
– కరోనా పరిస్థితులపై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నూతన వేరియంట్ల నేపథ్యంలో పలు దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. అయితే రాష్ట్ర ప్రజలు కోవిడ్‌ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో కరోనాపట్ల అవగాహనతో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో హరీశ్‌ రావు వైద్యాధికారులతో శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల వైద్యాధికారులతో చర్చించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందనీ, ప్రికాషన్‌ డోసును పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించామని తెలిపారు. 1.35 కోట్ల ప్రికాషన్‌ డోసులు పంపిణీ చేశామనీ, ఇంకా 1.62 కోట్ల డోసులు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. కోవిడ్‌ నుంచి తమను తాము రక్షించుకోవడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరిన్ని డోసులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్‌ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూమ్‌ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్‌ రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్‌ అజరు కుమార్‌, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love