– ఫలితాలను ఇస్తున్న ప్రభుత్వ ప్రాజెక్టు
– ‘కుడుంబశ్రీ’ మహిళల విజయం
తిరువనంతపురం : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ మధ్య వ్యర్థాలను సేకరణ క్లిష్టంగా మారింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించడంతో కుడుంబశ్రీలోని మహిళా సభ్యులు ఇంటింటికీ చెత్త సేకరణలో విజయం సాధించారు. కేరళలోని అగ్రగామి మహిళా స్వయం సహాయక బృందం కుడుంబశ్రీ. ఈ సహాయక బృందానికి చెందిన హరిత కర్మ సేన రాష్ట్రవ్యాప్తంగా గృహాలు, సంస్థల ఇంటి గుమ్మాల వద్ద బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించడంలో విశేషమైన పనిని నిర్వహిస్తున్నది. ‘మాలిన్య ముక్త కేరళం’ (వ్యర్థ రహిత కేరళ) ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుంచి మెజారిటీ స్థానిక స్వీయ ప్రభుత్వాలు(ఎల్ఎస్జీ) రికార్డు కవరేజీని సాధించాయి. సేనలో 33,378 మంది సభ్యులతో, 422 స్థానిక సంస్థల్లో 90-100శాతం, 298 స్థానిక సంస్థల్లో 75-90 శాతం, 78 స్థానిక సంస్థల్లో 50 శాతంలోపు డోర్ స్టెప్ కలెక్షన్ కవర్ చేసింది. ప్రభావవంతమైన వ్యర్థాల సేకరణ, వేరుచేయడం, పారవేయడం, రీసైక్లింగ్ చేయడంతో పాటు, ఈ ప్రక్రియ కుడుంబశ్రీ సభ్యులకు ఉపయోగపడుతున్నది. నాన్-డిగ్రేడబుల్ వ్యర్థాల విక్రయం ద్వారా వారి ఆదాయాలు పెరుగుతాయి.
ప్రాజెక్ట్ను తదుపరి దశకు తీసుకువెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో జీరో వేస్ట్ సాధించడానికి రూ. 2,400 కోట్లతో కేరళ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (కేఎస్డబ్ల్యూఎంపీ)ని ప్రారంభించింది. రాష్ట్రంలో వేగవంతమైన పట్టణీకరణతో వ్యర్థాలు శూన్యంగా ఉండేలా మెటీరియల్ సేకరణ సౌకర్యం కోసం బ్లూప్రింట్ కూడా ప్రచురించబడింది.