నవతెలంగాణ హైదరాబాద్: ఇంటింటికీ ఆర్టీసీ కార్గో సేవల్ని అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సేవల్ని ఆదివారం హైదరాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివరీ ప్రారంభిస్తున్నామని వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగానూ విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే ఉండగా.. లాజిస్టిక్స్(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని 31 ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. పార్సిల్‌ను వాటిల్లోని ఏదో ఒకదానిలో అందిస్తే అక్కణ్నుంచి అందులో పేర్కొన్న చిరునామాకు తీసుకెళ్లి అందిస్తారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని పొన్నం తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.