– సెప్టెంబర్ 5 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. శనివారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులేననీ, వెబ్ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు కొత్తగా చేసుకుని ఆప్షన్లను ఇవ్వాల ని సూచించారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని వివరించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు (వికలాంగులు, సీఏపీ, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టీవిటీస్) అభ్యర్థులకు వచ్చేనెల నాలుగో తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. వచ్చేనెల తొమ్మిదిన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేనెల పది నుంచి 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 11 నుంచి 15 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో 16 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను 64 కాలేజీల్లో ప్రారంభించామని పేర్కొన్నారు. అందులో 29 ప్రభుత్వ, 35 ప్రయివేటు డిగ్రీ కాలేజీలున్నాయని వివరించారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, బీఎస్సీ బయోటెక్నాలజీ ఆనర్స్ కోర్సులనూ నూతనంగా ప్రారంభించామని తెలిపారు. ఇంజినీరింగ్, నీట్, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత దోస్త్ అడ్మిషన్లను నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఎస్కే మహమూద్, ఓయూ వీసీ డి రవీందర్, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, శాతవాహన వీసీ ఎస్ మల్లేశం, పీయూ వీసీ లక్ష్మికాంత్ రాథోడ్, టీయూ రిజిస్ట్రార్ ఎం యాదగిరి, మహిళా వర్సిటీ వీసీ ఎం విజ్జులత, సీడీసీ పి రామచంద్రం, జాయింట్ డైరెక్టర్లు రాజేందర్‌సింగ్, జి యాదగిరి, సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ పి బాలభాస్కర్, రూసా ప్రాజెక్టు ఆఫీసర్ సౌందర్య జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.