డబుల్‌ ధమాకా..

‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాల తరువాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ (వర్కింగ్‌ టైటిల్‌). హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. గత కొద్దిరోజులుగా ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ టైటిల్‌ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా చిత్ర బృందం టైటిల్‌ వెల్లడికి ముహూర్తం ఖరారు చేసింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈనెల 31న టైటిల్‌ని రివీల్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. కృష్ణ నటించిన ఆల్‌ టైం హిట్స్‌లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా ఈనెల 31న 4కె ఫార్మెట్‌లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ని విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతుల మీదుగా ‘మాస్‌ స్ట్రైక్‌’ పేరుతో విడుదల కానుంది. ఈ గ్లింప్స్‌ అభిమానులకి మాస్‌ ఫీస్ట్‌ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

Spread the love