– బలవంతంగా వెళ్లగొట్టిన అధికారులు
– ప్రతిఘటించిన పేదలు, పెట్రోల్ పోసుకొని నిరసన
– ఆక్రమించుకున్న ‘డబుల్’ ఇండ్లు ఖాళీ చేయాలి : ఆర్డీఓ డీఎస్ వెంకన్న
నవతెలంగాణ-పాలకుర్తి
నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించకపోవడంతో నిరాశచెందిన పేదలు వాటిని ఆక్రమించుకొని నివాసముంటున్నారు. వారు ఖాళీ చేయాలని అధికారులు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో బుధవారం బలవంతంగా ఖాళీ చేయించారు. పేదలు ప్రతిఘటించి పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు(జే)లో జరిగింది. తొర్రూరు గ్రామంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 20 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించింది. అర్హులను గుర్తించి ఇండ్లు కేటాయించకపోవడంతో పడావుపడ్డాయి. దాంతో ఆగ్రహించిన గ్రామానికి చెందిన 20 మంది పేదలు.. ఎనిమిది నెలలుగా ఆ ఇండ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. కాగా, అక్రమంగా ఆక్రమించుకున్న ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు వారిని పలుమార్లు హెచ్చరించారు. అయినా వారు ఖాళీ చేయకపోవడంతో బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. ఇండ్లు ఖాళీ చేయబోమని లబ్దిదారులు పట్టుబట్టడంతో ఉద్రిక్తత వాతావరణంలో అధికారులు వారి సామాన్లను బయట పడేసి ఇండ్లకు తాళాలు వేసి సీల్ వేశారు. దాంతో తాము ఎక్కడ ఉండాలంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ పసలాది అంజమ్మ, పసులాది పద్మ పెట్రోలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గడ్డం భూలక్ష్మి, జోడు ఇందిర, గడ్డం ప్రజాపతి పెట్రోలు ఒంటిపై పోసుకొని నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన లబ్దిదారులను గుర్తించి గ్రామపంచాయతీ తీర్మానం చేసి తహసీల్దార్ కార్యాలయానికి అందజేసిందని తెలిపారు. అయినా ఇండ్లు కేటాయించకపోవడంతో తాము నివాసం ఉంటున్నామని, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు ఖాళీ చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండటానికి ఇల్లు లేకపోవడం, వరుసగా కురుస్తున్న వర్షాలకు పాత ఇండ్లు నేలమట్టం కావడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్నామని బోరున విలపిస్తూ తెలిపారు. అధికారులు బలవంతంగా ఖాళీ చేయించడంతో ఆరుబయటే ఉండాల్సి ఉంటుందని, వర్షాలకు ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. కాగా, పెట్రోలు తాగిన మహిళలు, ఒంటిపై పెట్రోలు పోసుకున్న మహిళలను స్థానికులు వైద్యం కోసం పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎనిమిది నెలలుగా నివాసముంటున్న అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవరుప్పుల ఎస్‌ఐలు యాకూబ్ హుస్సేన్, సృజన్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌ఐ రాకేష్, పంచాయతీ కార్యదర్శి మహేష్‌తో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఖాళీ చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకొని చొరబడ్డారని, ఆక్రమించుకున్న ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న సూచించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమంగా ఆక్రమించుకున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. మండలం లోని పాలకుర్తిలో 50, దర్దేపల్లిలో 40, తొర్రూరు జే వడ్డెర కాలనీలో 30 ఇండ్లకు లబ్దిదారులను గుర్తించి ఆన్‌లైన్ చేశామన్నారు. మిగతా గ్రామాల్లో లబ్దిదారులను గుర్తించలేదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఆక్రమించుకున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఖాళీ చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇండ్లు పూర్తయిన గ్రామాల్లో త్వరలోనే గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన పేదలను ఎంపిక చేసి అందజేస్తామని తెలిపారు.
– ఆర్డీఓ డీఎస్ వెంకన్న