– సాగు నీరందించే వరకు పోరాటం : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం
– చండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు
నవతెలంగాణ- చండూరు
డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలో సుమారు 3.41 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారన్నారు. సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్న గూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నదన్నారు. గత ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించలేదని, పర్యావరణ అనుమతుల కోసం లేఖ రాయలేదని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఆమోదిం పజేసి, అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేసేవరకు సీపీఐ(ఎం) దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, నాయకులు బల్లెం స్వామి, రాసాల బుగ్గయ్య, రాములు, అంజయ్య, గాలెంక నరేష్, నవీన్, వెంకన్న పాల్గొన్నారు.