వట్టిపోయిన శ్రీశైలం, జూరాల రిజర్వాయర్లు

– గత ఏడాది జులై 21న జూరాలలో 8.42 టీఎంసీలు
– తాజాగా డెడ్‌ స్టోరేజ్‌
–  ఆందోళనలో అన్నదాతలు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌
ప్రాంతీయ ప్రతినిధి
గత ఏడాది జులై 7వ తేదీ నాటికే భారీ వరదల వల్ల జూరాలతోపాటు శ్రీశైలం గేట్లను తెరిచారు. ఈ ఆ జలాశయాలు వెలవెల పోతున్నాయి. వరదలు మరింత ఆలస్యమైతే వరి నాట్లకు ఇబ్బందులు తప్పేలా లేదు. ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్‌ ఆధారంగా నిర్మించుకున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్న ఆయకట్టు అంతా బీళ్లుగా మారే అవకాశాలున్నాయి. జూరాలది అదే పరిస్థితి. ఈ రిజర్వాయర్‌ మీద నెట్టెంపాడు, రామన్‌పాడు, బీమా వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. రెండు రిజర్వాయర్ల పరిధిలో సుమారు ఐదు లక్షల ఎకరాలకుపైగా సాగయ్య అవకాశాలు ఉన్నాయి. రిజర్వాయర్లోకి నీటి చుక్క రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఈపాటికే భారీ వరదలు వచ్చి కృష్ణానది పరవళ్ళు తొక్కింది. ఈసారి ఆ పరిస్థితులు లేవు. జూరాల నీటి సామర్థ్యం 1045 అడుగులు, 9.66 టీఎంసీలు. అయితే, 3.95 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఎడాది జులై 21న 8.42 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 885 అడుగుల నీళ్లు రావాలి. 33.58 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఈసారి చాలా తక్కువగా ఉంది. జూరాలలో ఐదు టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో నదులు ఎండిపోయాయి. రిజర్వాయర్లన్నీ వెలవెలబోతున్నాయి. రిజర్వాయర్లకు అనుబంధంగా కృష్ణ, తుంగభద్ర, భీమా నదులు ఎండిపోయాయి. ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో వర్షాలు లేకపోవడంతో వరదలు లేవు.
సాగు భూములు బీడు
రిజర్వాయర్ల కింద సాగయ్యే భూములు నీరు లేక బీడుగా మారాయి. సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌లో సాగయే సోనా, మసూరి, బాపట్ల, సాంబార్లు ఐదు నెలలకు దిగుబడి వస్తుంది. వర్షాలు ఆలస్యం కావడంతో ఈ పంటలు సాగు ఈసారి కష్టమే. సాగు చేసినా తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. హంస సాగైతే దిగుబడి తక్కువగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Spread the love