ద్రవిడ్‌ దారెటు? చీఫ్‌ కోచ్‌గా ముగిసిన కాంట్రాక్టు

ద్రవిడ్‌ దారెటు? చీఫ్‌ కోచ్‌గా ముగిసిన కాంట్రాక్టుముంబయి : 2023 ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్‌ భావోద్వేగ సన్నివేశాలతో సాగింది. ప్రపంచకప్‌ పట్టేశామనే భావనలో ఉండిన టీమ్‌ ఇండియా.. ఆఖరుకు అది ఆస్ట్రేలియా చెంత చెరటంతో భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేకపోయారు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంట నీరు పెట్టగా.. రోహిత్‌ శర్మ కంటి వెనుక బాధను అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు. విరాట్‌ కోహ్లి ముఖాన్ని క్యాప్‌లో దాచుకున్నాడు. చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. సరిగ్గా 20 ఏండ్ల కిందట జొహనెస్‌బర్గ్‌లో ఆటగాడిగా ఇంతకుమించి వేదన అనుభవించిన రాహుల్‌ ద్రవిడ్‌.. ఆదివారం చీఫ్‌ కోచ్‌గా ఓటమి బాధను తీసుకోలేకపోయాడు. టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కాంట్రాక్టు ప్రపంచకప్‌ ఫైనల్‌తో ముగిసింది. కీలక ఆటగాళ్లకు వరుసగా గాయాలు, అత్యధిక మ్యాచుల్లో ద్వితీయ శ్రేణి క్రికెటర్లతోనే నెట్టుకొచ్చిన రాహుల్‌ ద్రవిడ్‌ ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా స్వరూపం మార్చివేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం, భారత జట్టు ఆట తీరు సరికొత్త స్థాయికి తీసుకెళ్లాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో క్రికెటర్ల బంధం చూసి సోషల్‌ మీడియాలో అభిమానులు పండుగ చేసుకున్నారు. అందుకు రాహుల్‌ ద్రవిడ్‌కు తప్పకుండా ఘనత ఇవ్వాల్సిందే.
రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా టీ20 ప్రపంచకప్‌, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో టీమ్‌ ఇండియా పోటీ పడింది. టీ20 ప్రపంచకప్‌ వేటకు సెమీస్‌లో తెరపడగా.. టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమి ఎదురైంది. తాజాగా ప్రపంచకప్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ కప్పును ఎగరేసుకుపోయింది. ఈ మూడు టైటిళ్లలో ఏ ఒక్క టైటిల్‌ నెగ్గినా రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా విజయవంతం అయ్యేవారు. 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ వేటలో అనిల్‌ కుంబ్లే ఆఖరు మెట్టుపై తడబడినట్టే.. రాహుల్‌ ద్రవిడ్‌కు సైతం చేదు అనుభవమే ఎదురైంది. నవంబర్‌ 23 నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో భారత జట్టు ప్రయాణం మళ్లీ మొదలు కానుంది. మళ్లీ కొత్త ప్రణాళికలు, కొత్త లక్ష్యాలు. మరో ఏడాది పాటు చీఫ్‌ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తి చూపిస్తారా? లేదంటే ప్రపంచకప్‌ ఓటమితో వైదొలుగుతారా? అనేది చూడాలి. త్వరలోనే బీసీసీఐ పెద్దలతో రాహుల్‌ ద్రవిడ్‌ భేటీ కానున్నారు. ఆ తరువాతే భారత జట్టుతో ద్రవిడ్‌ భవితవ్యం తేలనుంది.

Spread the love