హెడ్‌ కోచ్‌గా పదవిని తిరస్కరించిన ద్రవిడ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్ ఇండియాకు సరికొత్త హెడ్‌ కోచ్‌ నియామకానికి బీసీసీఐ వేట మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అవసరమైతే ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకొనే అవకాశం కల్పించింది. మరోవైపు ద్రవిడ్‌ ఈ సారి టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోచ్‌ పదవి నుంచి వైదొలగాలని బలంగా నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌ కోచ్‌ పదవికి ఎటువంటి దరఖాస్తు పంపించదల్చుకోలేదని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. అతడు పొడిగింపును కూడా కోరుకోవడంలేదని వెల్లడించింది. భారత జట్టులోని కొందరు సీనియర్లు ద్రవిడ్‌ను సంప్రదించి కనీసం టెస్టు జట్టుకు మరో ఏడాది పాటు కోచ్‌గా కొనసాగాలని అడిగినట్లు దానిలో పేర్కొంది. ఈ ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్లు సమాచారం. 2023 ప్రపంచకప్‌ తర్వాత తనకు లభించిన పొడిగింపునకు మించి కొనసాగ కూడదని బలంగా నిర్ణయించుకొన్నట్లు అర్థమవుతోంది. ఒక వేళ అతడు అంగీకరిస్తే ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమించవచ్చని తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ఆ అవసరం జట్టు యాజమాన్యానికి లేదు. కొత్త కోచ్‌ కోసం వేట ఇప్పుడే మొదలైంది. ఎన్‌సీఏ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు రేసులో వినిపిస్తోంది. గతంలో ద్రవిడ్‌ గైర్హాజరీలో జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. కాకపోతే టాప్‌ అభ్యర్థుల జాబితాలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Spread the love