రూ. 1.2 కోట్లతో పరారైన ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రైవర్

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి రూ. 1.2 కోట్లతో పరారైన ఓ కారు డ్రైవర్‌ను పోలీసులు రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన బానోతు సాయికుమార్ మూడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ ఉపాధ్యక్షుడైన శ్రీనివాసరావు ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు సాయికుమార్‌కు రూ. 1.2 కోట్లు ఇచ్చి తన ఇంట్లో ఇవ్వాలని సూచించారు. ఆ డబ్బులు తీసుకుని కారులో బయలుదేరిన సాయికుమార్ కొంతదూరం వెళ్లాక వాహనాన్నిరోడ్డు పక్కన నిలిపేసి డబ్బులతో పరారయ్యాడు. సాయికుమార్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం, డబ్బులు ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు డ్రైవర్ సాయికుమార్‌కు ఫోన్ చేస్తే కలవలేదు. దీంతో అదే రోజు సంస్థ ఏజీఎం జిలానీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి రాజమండ్రిలో ఉన్నట్టు గుర్తించారు. నిన్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్టు సమాచారం.

Spread the love