బీఆర్‌ఎస్‌ తప్పిదాలతోనే కరువు

బీఆర్‌ఎస్‌ తప్పిదాలతోనే కరువు– కాళేశ్వరం నీళ్లు లేకపోవడం ఎవరి వైఫల్యం?
– బీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం :రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ పదేండ్ల తప్పిదాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌పై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌తో కలిసి సోమవారం ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడిన దృష్ట్యా కొన్నిచోట్ల నీరందని మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇది కాంగ్రెస్‌ తీసుకొచ్చిన కష్టం ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. వర్షాకాలం పూర్తయ్యాక తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. అధికారం లేదనో.. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారనో.. అక్కసుతో బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. గోదావరి, కృష్ణా నది పరివాహకంలో 56శాతం వర్షపాతం తక్కువగా కురిసిందని ఆనాడు త్రీ మ్యాన్‌ కమిటీ, కేఆర్‌ఎంబీ కమిటీ తేల్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అప్పట్లో మీరు దీనిపై లెటర్లు రాసిన మాట మరిచి కాంగ్రెస్‌పై అబాండాలు వేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో కిందకు నీళ్లు వదిలింది మీరు కాదా? అని నిలదీశారు. రూ.46వేల కోట్లతో నెలకొల్పిన మిషన్‌ భగీరథ పథకం చిన్నపాటి కరువుకే తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎవరి వైఫల్యం అనాలి? అని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ బాగోతాన్ని ఆడబిడ్డలు గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. ‘ముసలి కన్నీరు కారుస్తూ’ బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను యావత్‌ తెలంగాణ ప్రజానీకం గమనిస్తోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు, మీకు ఏ టీంగా ఉన్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మరోమారు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Spread the love