సర్కారు అసమర్థత వల్లే కరువు

Drought is due to inefficiency of the government– పంటలు ఎండుతున్నరు..గొంతులు తడారుతున్నారు
– తొండిపెట్టి కొద్దిపాటి రైతులకే సాయం
– తప్పించుకుందామంటే.. మీ వీపులు విమానం మోతమోగిస్తరు
– చేనేతలకు క్షమాపణలు చెప్పాలే.. లేకుంటే వారితో చెప్పుదెబ్బలు తప్పవు
– ఎన్నికల తరువాత 10వేల మందితో మేడిగడ్డ ముట్టడి : ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం
– ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటల పరిశీలన
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల / బోయిన్‌పల్లి
‘నిండు జలాలతో కళకళలాడిన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినరు? కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చవట విధానాల వల్ల ఈ దరిద్రం వచ్చింది. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచి నీళ్ల ట్యాంకర్లు, ఏ బిందల కొట్లాటలు, కాలిపోయిన మోటర్లు కనబడుతుండెనో ఇప్పుడు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కచ్చితం గా కాంగ్రెస్‌ తెచ్చిన కరువే!’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘కేసీఆర్‌ పొలం బాట’ కార్యక్రమంలో భాగం గా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటిచిన ఆయన మొదట ముగ్దుంపూర్‌ గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. అక్కడి రైతుల బాధలు తెలుసుకున్నారు. అనంతరం సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల కేంద్రంలో రైతులతో ముఖాముఖి అయ్యారు. శభాష్‌పల్లి నుంచి మధ్యమా నేరు జలాశయాన్ని పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బాబూజగ్జీవన్‌రావు చిత్రపటానికి కేసీఆర్‌ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యా లను ఎండగడుతూ మాట్లాడారు. చనిపోయిన రైతు కుటుంబాలకు తలా రూ.25లక్షలు వెంటనే పరిహారం చెల్లించి.. పరామర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టపరిహారం కింద ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల సీఎంలు ఫడ్నవీస్‌, జగన్‌ సహా ఆనాటి గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించామని గుర్తు చేశారు. అప్పుడు తాను కరీంనగర్‌లో ఓ స్పష్టమైన మాట చెప్పానని.. కాళేశ్వరంతో ఈ జిల్లాకు నీళ్ల ఢోకా ఉండబోదని, నాలుగు జిల్లాల్లోనూ సజీవ జలధారలు ఉంటాయన్నానని గుర్తు చేశారు. మానేరు వాగు, అప్పర్‌ మానేరు డ్యాం మొదలుకుని అన్నారం బ్యారేజీ దగ్గర గోదావరి కలిసే వరకూ నిరంతరం నీళ్లతో కళకళలాడిన రోజులన్నీ కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన కొద్ది రోజుల్లోనే మాయం అయ్యాయని అన్నారు. గోదావరి మీద నిర్మించిన బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తికావడం, ఎస్సారెస్పీకి నీళ్లు తక్కువైతే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా పునరుజ్జీవం రావడంతో గోదావరి నది 200 కిలోమీటర్ల పొడవునా నిండుగా జలాలతో ఉండేదన్నారు. మరో జలధారలో శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకంతో వరద కాలువనే రిజర్వాయర్‌గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవునా నిండి ఉండేలా చేశామన్నారు. ఇప్పుడు ఆ వరద కాలువా నెర్రలుబారిందన్నారు. ఐదారేండ్లు ఈ సజీవ జలధారలను ఎలా అనుభవించారో యావత్‌ ప్రజానీకానికి తెలునని, ఇప్పుడు ఆ జలధారలు ఎలా మాయం అయ్యాయో అర్థం చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల తరువాత మేడిగడ్డ పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు 10వేల మంది రైతులతో కలిసి ముట్టడిస్తానని ప్రకటించారు. మిడ్‌ మానేరు కట్ట కొట్టుకుపోవడానికి కంపెనీ కారణం కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఆ మంత్రి అడ్డం పొడవు మాట్లాడుతున్నారని అన్నారు.కొన్ని జిల్లాలో ఏడు శాతం, మరికొన్ని జిల్లాల్లో 20శాతం, దాదాపు 20 నుంచి 25 జిల్లాల్లో అందులోనూ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతమే నమోదైందని వివరించారు. అధిక వర్షపాతం ఉన్న జిల్లాల్లోనే ఈ కరువు పరిస్థితులు ఎందుకు వచ్చాయని ప్రశ్నిస్తే వర్షపాతమే తక్కువ కురిసిందంటూ కొందరు అసమర్థ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ సామర్థ్యం తెలువని వాళ్లే రాజ్యమేలుతున్నారని విమర్శించారు. రాళ్ల వానతో 1.50లక్షల ఎకరాలు చేతికిరాకుండా పోతే.. నీళ్లు అందించలేని అసమర్థతో 15లక్షల నుంచి 20లక్షల ఎకరాలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను పర్యటించిన నాలుగైదు గ్రామాల్లో రైతులు వెలిబుచ్చిన బాధలన్నీ కన్నీటి గాథలేనని, తన పర్యటన లేని గ్రామాల్లో కూడా రైతులు అడ్డం తిరిగి ఎండిన తమ పొలాలు చూడాలని ప్రాధేయపడ్డారని అన్నారు. కొన్ని చోట్ల పైకి పచ్చగా కనిపించినా.. కింద పొలం నెర్రలు బారిందని చూడాలంటూ పొలంలోనికి తీసుకెళ్లి చూపించి రైతులు బోరున విలపిస్తున్నారని, ఇది ప్రతి చోటా ఉందని వివరించారు. అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి మంచిగున్న వాళ్ల నోట్లో కాంగ్రెస్‌ మట్టి కొట్టిందన్నారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నా రు. తప్పించుకుందామనుకుంటే.. ప్రజలు మీ వీపులు విమానం మోత మోగిస్తారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ డ్రామాలు నడవబోవని హెచ్చరిం చారు. ముఖ్యమంత్రి గలీజుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 20 రోజుల కిందట నీళ్లు వదిలి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా.. సిగ్గు లేకుండా ఇవాళ మళ్లీ నాలుగైదు హామీలు ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎవరిని ఉద్దరించడానికి హామీలు ఇచ్చారోగానీ, ఇవాళ పంటలు ఎండని, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదని, యావత్‌ రాష్ట్రమంతా పాత తెలంగాణగా మారిపోయిందన్నారు.బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్లతో చేనేతలకు చేతినిండా తాము పని కల్పిస్తే ఇప్పుడున్న సర్కారు ఎలాంటి ఆర్డర్లూ ఇవ్వకపోగా వారికి బకాయి ఉన్న రూ.300కోట్లు నిలిపి వేసిందన్నారు. ఆ బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రమంతా రణరంగాన్ని తలపించేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీజేపీ గురించి మాట్లాడటానికి ఏమి ఉందని ప్రశ్నించారు. కేసీఆర్‌ వెంట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, డాక్టర్‌ సంజరు సహా పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నారు.

Spread the love