ఖమ్మంలో డ్రగ్స్‌ కలకలం

Drug mix in Khammam– హెరాయిన్‌ పట్టుకున్న టూ టౌన్‌ పోలీసులు
– అప్రమత్తంగా వ్యవహరించిన టీజీఏఎన్‌బీ
– క్రిప్డో కరెన్సీతో కొనుగోలు.. అసోం నుంచి పార్సిల్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో సహకారంతో ఖమ్మం టూ టౌన్‌ పోలీసులు డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించారు. ఖమ్మం నగరంలో మొట్టమొదటి సారిగా డ్రగ్స్‌ కలకలం రేపడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు హెరాయిన్‌ పట్టుకున్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2.5 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో కొంతమంది యువకులు డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారంతో నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో సంబంధిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జులై 31న డార్క్‌ వెబ్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన సిల్పఖురి నుంచి క్రిప్టో కరెన్సీ ఆధారంగా డ్రగ్‌ తెప్పించుకున్నాడు. స్పీడ్‌ పోస్టు ద్వారా ఈనెల 8వ తేదీన ఆ డ్రగ్‌ సంబంధిత చిరునామాకు చేరింది. దీనిని సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తీసుకుంటున్న సమయంలో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యూస్‌ పేపర్‌లో టేప్‌ వేసి చుట్టిన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులకు విషయాన్ని వెల్లడించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టుబడిన యువకుడు ప్రముఖ న్యాయవాది కుమారుడని తెలుస్తోంది. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ డ్రగ్స్‌కు ఎడిక్ట్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ డ్రగ్‌ రాకెట్‌ వెనుక ఎవరున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Spread the love