నవతెలంగాణ – హైదరాబాద్: డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను ఆర్డర్ చేసుకుంటున్న ఓ సాఫ్ట్‌వేర్ గుట్టును టీజీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బట్ట బయలు చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ (హెరాయిన్ )ను ఆర్డర్ చేశాడు. ఈ డ్రగ్స్‌కు పేమెంట్‌ను క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లించినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సాంకేతిక విభాగం, ఖమ్మం పోలీస్ అధికారులు తెలుసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ ఆర్డర్ అస్సాం సిల్పుఖురి నుంచి ఖమ్మం కి డెలివరీ అవుతున్న కన్సైన్మెంట్ నెంబర్ ను ట్రేస్ చేసి ఆ డెలివరీని ట్రాక్ చేశారు. ఈ నెల 8వ తేదిన డెలివరీ అవుతున్న సమయంలో ఖమ్మంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్స్ ఆర్డర్ చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మత్తుకు బానిస అయ్యడని గుర్తించి అతనికి అతని తలిదండ్రుల ముందే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విధంగా రూట్ మార్చిన డ్రగ్స్ దందా చేస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డార్క్ వెబ్‌ను కూడా జల్లెడ పడుతున్నట్లు టీజీ నాబ్ అధికారులు హెచ్చరించారు.