డీఎస్‌ కన్నుమూత

DS passed away– కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స
– భౌతికకాయంపై కాంగ్రెస్‌ జెండా
– ప్రభుత్వ లాంఛనాలతో నేడు నిజామాబాద్‌లో అంత్యక్రియలు
– హాజరు కానున్న సీఎం, మంత్రులు
– పలువురు ప్రముఖుల సంతాపం
– మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ మృతి
– జెడ్పీ చైర్మెన్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేగానూ సేవలు
– ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్‌ నగర మేయర్‌గా పని చేశారు. చిన్న కుమారుడు అర్వింద్‌ బీజేపీ నిజామాబాద్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన భౌతికకాయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు,, ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ కాంగ్రెస్‌ జెండా కప్పి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు తీసుకొస్తారు. అక్కడ ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అంత్యక్రియల్లో పాల్గొంటారు.
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్‌ 1948 సెప్టెంబర్‌ 25న జన్మించారు. తన విద్యార్థి దశలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. నిజామాబాద్‌ జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రెండుసార్లు పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఎంపీగా, రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు.1989, 99, 2004లో వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగారు. ఆపై రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కేసీఆర్‌తో విభేదించి సొంత గూటికి చేరారు. తన భౌతికకాయంపై కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ గూటికి చేరినట్టు చెప్పారు. అదే నా చివరి కోరిక అంటూ తన సన్నిహితులతో అనేవారు. ఈ క్రమంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ జెండాను అవతనం చేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. డీఎస్‌ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర సాధనకు అవిశ్రాంత కృషి : గవర్నర్‌
ధర్మపురి శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకష్ణన్‌ తెలిపారు. సీనియర్‌ రాజకీయ నేతగా రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారనీ, ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. అనంతరం నివాళులర్పించారు. తెలంగాణ శాసన మండలి తొలి ప్రతిపక్ష నాయకుడు డీఎస్‌ అని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, అనుచరులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
డీఎస్‌ రాజకీయ నేతలెందరికో ఆదర్శం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్‌ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్‌ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డీఎస్‌ మరణం బాధాకరం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్‌ తనదైన ముద్రవేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని గుర్తు చేశారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పలువురు మంత్రుల సంతాపం
డీ శ్రీనివాస మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు సీనియర్‌ నేత మధుయాష్కీగౌడ్‌, వీ హనుమంతరావు తదితరులు సంతాపం తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి…డీఎస్‌ మృతి పట్ల సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ మృతి
– జెడ్పీ చైర్మెన్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేగానూ సేవలు
– ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర
ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రాథోడ్‌ రమేష్‌(57) మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆదిలాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లడంతో పరిస్థితి విషమిం చింది. శనివారం ఆదిలాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి నుంచి హైదారాబాద్‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ రమేష్‌ 1966 అక్టోబర్‌ 20న జన్మించారు. టీడీపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన తొలుత నార్నూర్‌ జెడ్పీటీసీగా పని చేశారు. టీడీపీ హయాంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌గా వ్యవహరించారు. 2009లో టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2018లో ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2021 జూన్‌లో బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో రాథోడ్‌ తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. జెడ్పీ చైర్మెన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణ తదితరులు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆదివారం ఉదయం 10.30గంటలకు ఉట్నూర్‌ మండలంలోని లింగోజితండా(ఎక్స్‌రోడ్‌) వద్ద వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Spread the love