రోస్టర్‌ వివరాల్లేకుండానే డీఎస్సీ నోటిఫికేషన్‌

 DSC notification without roster details– జిల్లాలు, రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా పోస్టులేవీ?
– 15 నుంచి అందుబాటులో ఉంటాయన్న విద్యాశాఖ
– నాలుగు రెట్లు పెరిగిన దరఖాస్తు ఫీజు
– రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచిన ప్రభుత్వం
– ఎస్సీ,ఎస్టీ, బీసీ, వికలాంగులకు మినహాయింపు లేదు : ఉపాధ్యాయ అభ్యర్థుల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గుట్టుచప్పుడు కాకుండా జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. నోటిఫికేషన్‌ అంటేనే అందులో అన్ని వివరాలు సమగ్రంగా ఉంటాయి. అభ్యర్థులకు కావాల్సిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. కానీ పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ అందుకు భిన్నంగా ఉన్నది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఆన్‌లైన్‌లో డీఎస్సీ రాతపరీక్షలు, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలను మాత్రమే పొందుపరిచారు. రోస్టర్‌ పాయింట్ల ప్రకారం సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా మాధ్యమం వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయన్న వివరాలను ప్రకటించలేదు. రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా ఉపాధ్యాయ పోస్టుల సమాచారం ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈనెల 15 నుంచి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇప్పటికే అతి తక్కువ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేశారంటూ అభ్యర్థులు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో హామీ ఇచ్చినట్టుగా 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకోసం ఆందోళనలు చేపట్టారు. అయినా విద్యాశాఖ అధికారులు 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం.
అభ్యర్థులపై పెనుభారం
ఉపాధ్యాయ అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ పెనుభారం మోపింది. రూ.200 ఉన్న దరఖాస్తు ఫీజును రూ.వెయ్యికి పెంచింది. అంటే దరఖాస్తు ఫీజును నాలుగు రెట్లు పెంచడం గమనార్హం. ఇంకోవైపు ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులకు గతంలో మినహాయింపు ఉండేది. ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఆ మినహాయింపును ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ తీరు పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ ప్రకటించినపుడు దరఖాస్తు ఫీజు రూ.200 ఉన్నది. ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులకు రూ.80 కట్టాలని నిర్ణయించింది. అయితే అప్పుడు ఆఫ్‌లైన్‌లో రాతపరీక్షలను నిర్వహించారు. ప్రస్తుత డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసమే దరఖాస్తు ఫీజును పెంచినట్టు అధికారులు చెప్తున్నారు.
1,523 ప్రత్యేక టీచర్‌ పోస్టుల భర్తీ జరిగేనా?
1,523 ప్రత్యేక టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాటి భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయినా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. దీంతో 1,523 ప్రత్యేక టీచర్‌ పోస్టుల భర్తీ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు అభ్యర్థుల్లో కలుగుతున్నాయి. అయితే పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం ప్రత్యేక టీచర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయాలనీ, వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మరికొందరు ప్రత్యేక టీచర్లుగా ఎస్జీటీలుగా పనిచేస్తున్న వారు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. దానిపై స్పష్టత వచ్చాకే ప్రత్యేక టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశమున్నది.
నాలుగు నెలల సమయమివ్వాలి : రామ్మోహన్‌రెడ్డి
డీఎస్సీ రాతపరీక్షలకు నాలుగు నెలల సమయమివ్వాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్‌ విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెలలో గ్రూప్‌-3, నవంబర్‌లో గ్రూప్‌-2 రాతపరీక్షలు న్నాయని వివరించారు. అందుకే డీఎస్సీ రాతపరీక్షలను డిసెంబర్‌ చివరివారంలో లేదా జనవరిలో నిర్వహించాలని కోరారు. టెట్‌లో ఉత్తీర్ణులైన అందరికీ డీఎస్సీకి అవకాశమివ్వాలని సూచించారు. టెట్‌, డీఎస్సీకి డిగ్రీ మార్కుల శాతాన్ని వేర్వేరుగా చూడడం సరైంది కాదని తెలిపారు.
ఆన్‌లైన్‌లో నవంబర్‌ 20 నుంచి డీఎస్సీ రాతపరీక్షలు
5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది. మొదటిసారిగా డీఎస్సీ రాతపరీక్షలను నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష (సీబీఆర్టీ) విధానంలో నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి వచ్చేనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌, 611 లాంగ్వేజ్‌ పండితులు, 164 వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ), 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) కలిపి మొత్తం 5,089 పోస్టులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 358 పోస్టులు, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులు భర్తీ అవుతున్నాయి. వందలోపు పోస్టులు తొమ్మిది జిల్లాల్లో ఉన్నాయి. 11 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్షలను నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏండ్లు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేండ్లు సడలింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ అది వర్తిస్తుంది. వికలాంగులకు మాత్రం పదేండ్లు సడలింపు ఉంటుంది. అయితే మొదటిసారి బైలింగ్వల్‌ (రెండు భాషల్లో) ప్రశ్నాపత్రం అందుబాటులోకి తెస్తున్నారు. ఉదాహరణకు తెలుగు/ఇంగ్లీష్‌, హిందీ/ఇంగ్లీష్‌ ప్రశ్నాపత్రాలుంటాయి. అయితే 160 ప్రశ్నలకు 2.30 గంటలపాటు రాతపరీక్షలుంటాయి. వాటిని 80 మార్కులుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆ రెండింటినీ కలిపి డీఎస్సీ మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. ఈనెల 15 నుంచి షషష.రషష్ట్రశీశీశ్రీవసబ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే ఏయే పోస్టులకు ఎవరు అర్హులనే విధివిధానాలను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేశారు. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులే అర్హులని ప్రకటించారు.

Spread the love