– ముగిసిన రాతపరీక్షలు
– రాష్ట్రవ్యాప్తంగా 87.61 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో ఈ పరీక్షలు గతనెల 18 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ముగిశాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 (87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. 34,694 (12.39 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు 1,61,745 మంది దరఖాస్తు చేస్తే, 1,37,872 (85.24 శాతం) మంది పరీక్ష రాశారని తెలిపారు. 23,873 (14.76 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకు 88,005 మంది దరఖాస్తు చేయగా, 81,053 (92.10 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 6,952 (7.9 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. లాంగ్వేజ్ పండితులు (ఎల్పీ) పోస్టులకు 18,211 మంది దరఖాస్తు చేస్తే, 16,092 (88.36 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 2,119 (11.64 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులకు 11,996 మంది దరఖాస్తు చేయగా, 10,246 (85.41 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. 1,750 (14.59 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఈనెలాఖరులో డీఎస్సీ రాతపరీక్షల ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఆన్‌లైన్‌లో రాతపరీక్షలను నిర్వహించడంతో వీలైనంత త్వరగానే ఫలితాలు విడుదల చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.