డీఎస్సీ రాత పరీక్షలు ఆరునెల్లు వాయిదా వేయాలి

– ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సీఎంకు బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించిన 13,086 ఉపాధ్యాయ పోస్టులు, ఉపాధ్యాయుల బదిలీలతో ఏర్పడే అదనపు ఖాళీల భర్తీకి రీ-నోటిఫికేషన్‌ జారీ చేసి, డీఎస్సీ రాత పరీక్షలను ఆరు నెల్లు వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోస్టుల భర్తీలో 33 జిల్లాల వారీగా రోస్టర్‌ ప్రకారం విభజిస్తే సబ్జెక్ట్‌ కేటగిరీల వారీగా ఒకటి, రెండు పోస్టులు కూడా రావడం లేదు’ అని తెలిపారు. ఆరేండ్లుగా సుమారు ఆరు లక్షల మంది డీఎడ్‌,బీఎడ్‌ అభ్యర్థులు టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది 2022, మార్చి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. విద్యాశాఖ పరిధిలో మొత్తం 13,086 టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారని గుర్తు చేశారు. తర్వాత ఆ నోటిఫికేషన్‌ ఊసే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్‌ వస్తుందనే హడావిడితో కేవలం 5,089 టీచర్‌ పోస్టులకు మేలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ జారీలో కూడా టెట్‌ పరీక్ష ముగిసిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించిందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం గత ప్రకటనలకు విరుద్ధంగా టెట్‌ పరీక్ష నిర్వహించకుండానే ఆఘమేఘాల మీద, అసంపూర్తిగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని పేర్కొన్నారు. దీంతో లక్షలాది మంది డీఎడ్‌, బీఎస్‌ అభ్యర్థులు ఏకకాలంలో టెట్‌, డీఎస్సీ ప్రెపరేషన్‌ కు తగిన సమయం లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన ప్రకారం పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love