– ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
– నివేదికను ప్రభుత్వానికి పంపించాం మండల పశు వైద్యాధికారి శ్రీకర్ రెడ్డి
నవతెలంగాణ-యాలాల
విద్యుద్ఘాతంతో మూడు గేదేలు మృత్యువాత పడిన ఘటన మండల పరిధిలోని లక్ష్మినారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు గ్రామానికి చెందిన మాల శ్రీనివాస్‌కు దళిత బంధు పథకం కింద ప్రభుత్వం యూనిట్ మంజూరు చేసింది. రోజు మాదిరిగా తన 5 పాడి గేదెలను పశువుల పాక నుండి మేత మేపేందుకు పొలానికి తీసుకెళ్తుండగా ఓ రైతు పొలం దగ్గర ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర అర్థ్ సమస్య ఉంది. రైతు పొలం చుట్టు ఫినిషింగ్ ఏర్పాటుచేసిన కడీలు, తీగ తెగి కింద పడ్డాయి. తెగిపడ్డ తీగకు అర్త్ వచ్చింది. ఇది గమనించలేని మూగజీవాలు తీగపై కాలు పెట్టడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మూడు గేదెలు మత్యువాత పడ్డాయి. మిగతా రెండు గేదెలు తెగిపడ్డ తీగకు కాస్త దూరం ఉండటంతో బతికి బయటపడ్డాయి. ఒక్కో గేదె విలువ దాదాపు రూ.1 లక్ష ఉంటుందని తెలియజేశారు. దీంతో పాడి రైతు కుటుంబం బోరున విలపించింది. ఈ సంఘటన విషయమై మండల పశువైద్యాధికారి శ్రీకర్ రెడ్డినీ వివరణ కోరగా మూగజీవాల మత్యువాత సంఘటనపై నివేదికను ప్రభుత్వానికి పంపించామన్నారు. పాడి రైతుకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.