– ఒకప్పుడు 20 నుండి 25 పత్తి మిల్లులు నడిచేవి, ప్రస్తుతం 9 పత్తి మిల్లులు కొనసాగుతున్నాయి
ఒకప్పుడు 3000 మందికి ఉపాధి లభించేది ప్రస్తుతం 300 మందికి కూడా లభించని ఉపాధి
పత్తి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రావిడెంట్ లేదు పర్మినెంట్ కాదు
కార్మిక చట్టం ప్రకారం లభించని కూలి అమలుకు నోచుకోని పని దినాలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో భారీ సంఖ్యలో పత్తి పరిశ్రమలు ఉన్నాయి ఒకప్పుడు 20 నుండి 25 వరకు పత్తి పరిశ్రమలు కొనసాగేవి. వీటిలో దాదాపు 3,000 మంది వరకు కూలీలకు ఉపాధి లభించేది ప్రస్తుతం పరిశ్రమల్లో మార్పులు తీసుకువచ్చారు పెద్దపెద్ద జంబో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని కూలీల సంఖ్య పూర్తిగా తగ్గించారు. అప్పట్లో 3,000 మందికి ఉపాధి లభిస్తే ప్రస్తుతం 300 మందికి కూడా ఉపాధి లభించని పరిస్థితి మద్నూర్ మార్కెట్ పరిధి లో గల పత్తి పరిశ్రమల్లో ఏండ్ల తరబడి కూలి పని చేసే కార్మికులకు ప్రావిడెంట్ లేదు పర్మినెంట్ కాదు. పరిశ్రమల్లో పనులు చేస్తూ ప్రమాదవశాత్తు ప్రమాదాల్లో చిక్కుకొని కాళ్లు చేతులు పోగొట్టుకోవడం కొందరు అనుకోకుండా చనిపోతే పత్తా లేకుండా పరిశ్రమల యజమానులు బయటకు నొక్కకుండా కార్మికులకు అన్యాయం చేస్తూ కప్పిపుచ్చున సంఘటనలు లేకపోలేదు. మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి పరిశ్రమలు దాదాపు 1975 నుండి ఒకటి ఒకటిగా ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల్లో పనిచేసే వివిధ రంగాల కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కాక ప్రావిడెంట్ లేదు పర్మినెంట్ కాదు. చట్టం ప్రకారం కూలి ధర లభించదు.
ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నట్లు అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి. కార్మికులకు మాత్రం చట్టపరంగా న్యాయం చేకూర్చడంలో కార్మిక సంఘాలు కూడా పట్టుదలతో పని చేయకపోవడం పత్తి పరిశ్రమల యజమాన్యాలు ఆడింది ఆట పాడింది పాటగా పని దినాన్ని కల్పించకుండా, సరైన కూలీ ధర అందించకుండా, ఇష్టం వచ్చిన రీతిలో కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి చేతులు విరిగిన సంఘటనలు లేకపోలేదు అనడానికి మార్కెట్ పరిధిలోని ఒక పత్తి పరిశ్రమల్లో మహారాష్ట్రకు చెందిన ఒక కూలికి ప్రమాదం జరిగి చెయ్యి విరిగిన సంఘటన పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ పరిశ్రమల శాఖ గాని కార్మిక సంఘాలు గాని, లేబర్ కమిషనర్ శాఖ గాని, ఆ కూలికి ఎలాంటి న్యాయం చెయ్యలేరని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి ఘటన బయటకు నొక్కకుండా కప్పిపుచ్చడం ఇక్కడి పత్తి పరిశ్రమల్లో ఏ ఒక్క కార్మికునికి ప్రమాదాలపరంగా కాళ్లు చేతులు విరిగిన శాశ్వతంగా పనికి రాకుండా అంగవైకల్యం చెందిన అలాంటి కార్మికులకు ప్రభుత్వపరంగా న్యాయం జరిగినట్లు దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవం మేడేగా జరుపుకుంటాం. అలాంటి మేడే వచ్చే నెల 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ఉన్నారు. ఎన్నో కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మికులకు న్యాయం చేకూర్చేందుకు సంఘాలు ఉన్నాయి. అలాంటి సంఘాలు ఇక్కడి పత్తి మిల్లు పరిశ్రమలకు కార్మికుల న్యాయానికి ముందుకు రావడంలేదని ఆవేదన కార్మికుల్లో వ్యక్తం అవుతుంది. పరిశ్రమల శాఖ గాని కార్మిక శాఖ గాని పత్తి పరిశ్రమల్లో కార్మికులకు కల్పించవలసిన హక్కులు కల్పించకుండా కాలరాస్తున్నాయి. పత్తి మిల్లు కార్మికులకు న్యాయపరంగా పత్తి మిల్లు యజమానులు కల్పించవలసిన హక్కుల గురించి ఏ ఒక్క రోజు కూడా కార్మికులతో చర్చించిన దాఖలాలు లేవు. సచ్చినా బతికినా అంగవైకల్యం చెందిన చట్టపరంగా కూలి అందకపోయినా పట్టించుకునే నాధుడే లేరని పత్తి మిల్లు కార్మికుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇలాంటి అన్యాయాలు జరిగే పత్తి మిల్లుల కార్మికులకు ఇకనైనా న్యాయం చేకూర్చడానికి కార్మిక సంఘాలు పరిశ్రమల శాఖ కార్మిక శాఖ ముందుకు రావాలని కార్మికులు కోరుతున్నారు.