– బస్వాపూర్ లో తడిసిన ధాన్యమును పరిశీలించిన బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతన్నలు పూర్తిగా నష్టపోతున్నారని భువనగిరి ఎంపీ క్యామ మల్లేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి మండలంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బస్వాపూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కెసిఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బంది కాలేదని, ధాన్యం వెంటనే కొనుగోలు చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా రెండు నెలలు దాటిన కూడా ధాన్యం కొనుగోలు చెయ్యకపోవడంతో నిన్న చివరికి రాత్రి పడిన వర్షానికి ధ్యాన్యం తడిసిపోయిందనారు. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తో ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగునెలల్లోనే రైతులకు కష్టాలు వచ్చాయి. హస్తం పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షుడు జనగాం పాండు, పుట్ట వీరేష్ యాదవులు పాల్గొన్నారు.