తగ్గిపోతున్న అమెరికా స్టూడెంట్‌ వీసాలు

Dwindling US Student Visas– జనవరి-సెప్టెంబర్‌ మధ్య భారతీయులకు ఎఫ్‌..1 వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా విద్యా సంస్థల క్యాంపస్‌లు ఒకప్పుడు విదేశీ విద్యార్థులతో కళకళలాడేవి. అయితే గత సంవత్సరం జనవరి-సెప్టెంబర్‌ మధ్య భారతీయులకు అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో జారీ చేసిన వీసాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో భారతీయులకు అమెరికా 64,008 ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలు మంజూరు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో 1,03,495 వీసాలు జారీ అయ్యాయి. 2021లో ఇదే కాలంలో 65,235 వీసాలు, 2022లో 93,181 వీసాలు మంజూరు చేశారు. కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడిన 2020లో తొలి తొమ్మిది నెలల కాలంలో భారతీయులకు కేవలం 6,646 ఎఫ్‌-1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. వీసాల జారీలో తగ్గుదల కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది ద్వితీయ స్థానం కాగా ఆ దేశానికి కూడా వీసాల జారీ తగ్గిపోయింది. గత సంవత్సరం జనవరి-సెప్టెంబర్‌ కాలంలో చైనా విద్యార్థులకు 80,603 ఎఫ్‌-1 వీసాలు జారీ చేస్తే ఈ ఏడాది అదే కాలంలో 73,781 వీసాలు మంజురు అయ్యాయి. అయితే 2022లో జారీ చేసిన 52,034 వీసాలతో పోలిస్తే ఈ సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ఉన్నత విద్యలో భారతీయులు చేరుకున్న రెండు మైలురాళ్ల నేపథ్యంలో ఎఫ్‌-1 వీసాల జారీలో తగ్గుదల ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love