పైసా పెట్టుబడి లేకుండా కోట్లలో సంపాదన

– వేలల్లో బ్యాంక్‌ ఖాతాలు, సిమ్‌కార్డుల సేకరణ..
– కాల్‌ సెంటర్ల ఏర్పాటు
– సైబర్‌ కేసులపై ప్రత్యేక విచారణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
పైసా పెట్టుబడి లేకుండా సైబర్‌ నేరస్తులు రోజుకో తీరులో మోసాలకు పాల్పడుతూ కోట్లలో సంపాదిస్తున్నారు. లక్కీడ్రాలు, బ్యాంక్‌ వివరాలు అప్‌డేట్‌ చేస్తామని, కేవైసీ, ఆధార్‌ అప్‌డేట్‌, డెబిడ్‌, క్రెడిట్‌ కార్డుల లిమిట్‌ పెంచుతా మని, షేర్‌మార్కెట్‌, బిట్‌ కాయిన్‌ వ్యాపారం పేరుతో కొం దరు మోసాలకు పాల్పడుతుంటే, మరికొందరు ఉద్యోగాలు, రుణాలు, వీసాలు ఇప్పిస్తామంటూ దంటుకుంటున్నారు. తాజాగా మీకు ఇలీగల్‌ పార్శిల్‌ వచ్చిందని, లేదా మీ బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు వేశారని పోలీస్‌ విచారణకు రావాలంటూ బెదిరిస్తూ కూర్చున్న చోటే ఆన్‌లైన్‌ అడ్డాగా కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా కమీషన్ల మీద బ్యాంక్‌ ఖాతాలు, సిమ్‌కార్డులను సేకరిస్తున్నారు.
లింక్‌లు, మెసేజ్‌లతో
ప్రతి సెల్‌ఫోన్‌లో ఇప్పుడు డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించిన ఏదో ఒక యాప్‌ ఉంటుంది. కొన్ని యాప్‌లు నేరుగా ఖాతాదారుడు డౌన్‌లోడ్‌ చేసుకొని, పూర్తి వివరాలతో ఆపరేట్‌ చేస్తుండగా, మరికొన్ని సంస్థలు కేవైసీ ఫారాన్ని ఖాతాదారుడు అప్‌లోడ్‌ చేసిన తర్వాత, ఆయా కంపెనీల వారు నేరుగా వచ్చి ఖాతాదారుడిని కలిసి వెరిఫి కేషన్‌ కూడా చేస్తుంటాయి. ఇలా వేర్వేరు యాప్‌లు డిజిటల్‌ లావాదేవీల సేవలు అందిస్తున్నాయి. అయితే డిజిటల్‌ లావాదేవీలను ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ఖాతాదారులను మోసం చేస్తు న్నారు. లింక్‌లు, మెసేజ్‌లు, వాట్సాప్‌ గ్రూప్‌లకు సమా చారం పంపించి నిండా ముంచుతున్నారు. వచ్చిన డబ్బులను సైబర్‌ నేరస్తులు వివిధ బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే వేలాది బ్యాంక్‌ ఖాతాలను స్థంభింప చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి
పైసా పెట్టుబడి లేకుండానే సైబర్‌ నేరస్తులు మా టలతోనే దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొడుతున్నారు. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాలల్లో (నకిలీ) కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకుని, ఉద్యోగాలిస్తున్నారు. టార్గెట్లు పెట్టి మరీ దోచుకుంటున్నారు. ముఖ్యంగా ముంబాయి, ఢిల్లీ, నోయిడా, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి సైబర్‌ ఛీటర్లు ఫోన్లు చేసి, అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
ఏజెన్సీలతో లింకులు.. నిమిషాల వ్యవధిలో డబ్బులు బదిలీ
బ్యాంక్‌ అధికారుల కంటేకూడా సైబర్‌ నేరగాళ్ల వద్ద లక్షల ఖాతాదారులకు సంబంధించి సమాచారం ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది సిమ్‌ కార్డులను వినియో స్తున్నారు. దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు లక్షల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలను సేకరిస్తున్నారు. కొందరు ఏజెన్సీ లోని ఉద్యోగుల నుంచి సమాచారం సేకరిస్తుంటే మరికొందరు ఇంటర్‌నెట్‌లో లేదా ఇతర ఏజెంట్లు ద్వారా, మేయిల్స్‌ హ్యాక్‌ చేయడం, బ్యాంక్‌ అధికా రులమంటూ ఫోన్లు చేయడంతో పాటు తదితర మార్గాల ద్వారా ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు. మరికొన్ని సందర్భాలల్లో లింక్‌లు పంపించి సమాచారాన్ని దొంగిలి స్తున్నారు. ఇదిలావుండగా ఎవరైనా బాధితులు వివిధ సమస్యలపై కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేసినా సైబర్‌ నేరస్తులు వల వేసి మోసాలకు పాల్ప డుతున్నారు. ఎవరైన బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే తాము కాల్‌సెంటర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, మీ ఖాతా వివరాలు చెబితే సమస్య పరిష్కారమవుతుందంటూ నమ్మిస్తున్నారు. చిన్న క్లూ దొరికినా సరే వినియోగదారుడి మొబైల్‌ ఫోన్‌ నంబరు తెలుసుకుని ఖాతాల్లో ఉన్న డబ్బును నిమిషాల వ్యవధిలో మొబైల్‌ యాప్‌ ద్వారా బదిలీ చేసుకుంటున్నారు.
దాదాపు 18లక్షలకుపైగా కనెక్షన్లు రద్దు?
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని హైదరాబాద్‌, రాచకొండ, సైబర్‌రాబాద్‌ మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిల్లో ప్రతి రోజు 70కిపైగా సైబర్‌ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తు న్నారు. బాధితుల ఫిర్యాదుతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి విచారిస్తున్న తెలంగాణ పోలీసులకు ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. సైబర్‌ నేరస్తులు ఒకే డివైజ్‌ నుంచి వేలల్లో సిమ్‌ కనెక్షన్లను వినియోగించిన సందర్భాలున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇటీవల 28,220 ఫోన్లను బ్లాక్‌ చేయమని టెలికాం సంస్థలకు కేంద్రం ఆదేశిం చినట్టు తెలిసింది. ఈ ఏడాదిలో 1.70కోట్ల కనెక్షన్లను కేంద్రం తొలిగిం చిందని తెలుస్తోంది. ఇదే తరహాలో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు చెక్‌పెట్టేం దుకు కేంద్రం ఒకే సారీ 18లక్షలకుపైగా మొబైల్‌ కనెక్షన్లను తొలగించే అవకాశముందని తెలుస్తోంది.
అత్యాశకు పోయి మోసపోకండి..
బాధితులు చాలామంది అత్యాశ కుపోయి సైబర్‌ నేరస్థుల ఉచ్చులో చిక్కుతున్నారని సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్‌ చేవద్దని, వ్యక్తిగత వివరాలను షేర్‌ చేయవద్దన్నారు. కష్టపడకుండా ఊరికే డబ్బులు రావని, ఎవరు ఉచితంగా ఏదీ ఇవ్వరని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఏదైనా సమాచారం సేకరించే సమయంలోగానీ, వస్తువులు కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫోన్‌లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఆర్థిక లావాదేవీల విషయం మాట్లాడితే వారిని అనుమానించాలన్నారు.

Spread the love