భూమి స్వప్నం

Earth is a dreamహరితహారం గుభాలింపులు..
ఊర్వి ఒడిలో కన్నీళ్ల కడలి కెరటాలయి..
పర్యావరణ పరిరక్షణ నినాదం..
రెక్కలు తెగిన పక్షిలా గిజ గిజ లాడుతుందీ.!
ఏలికల సామ్రాజ్య కాంక్ష.. అణు అస్త్రాల ఆటలో.. మానవత్వం! మనిషి నడుము చుట్టూ తూటాల దండాలయి.. అరచేతి గుప్పిట్లో ప్రాణం బిక్కు బిక్కు మంటుంది..!
వినీలాకాశంలో ఆకు చాటు పిందెలా..
సప్తవర్ణాల ఆవరణం.. చీకటి గుహలో మగ్గిపోతు.. పారిశ్రామిక గాజు బొమ్మయి కాంతులు ఓలకపోస్తూనే వుందీ..! పైసా మోజులో పడ్డ మనిషి.. చేస్తున్న గాయపు మరకలు రేపటి తరాలకు శరాఘాతమై తగిలిన వేళ
పుడమి నుదుటి ఎర్రని బొట్టు ద్రవించి.. ఘనీభవించిన కరుణ రసం కాసులకే కరిగే కాలం హృదికి దాసోహమై..
రేపటి మనిషి ఉనికికే ప్రశ్నర్థకమైన్న.. ఈ ఘడియలో
పంచభూతల విశాల విశ్వ ప్రేమ చిగురుల తొలి చినుకులు..
ఆకురాల్చని కాలమై కాటు వేస్తుంది..!
కమ్మగా కన్నీళ్లు తుడిచే లేలేత సుగంధ పరిమళాలు
కాలుష్యం కోరలో చిక్కి, దుర్గంద భరితమై
అంకురాల ఆశలకు చెదలు పట్టి..
అన్నదాత ఎదలో ఆరని మంటలయి జ్వలిస్తుంటే..
ధాత్రి పుక్కిట ప్రతిధ్వనిస్తున్నా ప్రకృతి హోరు సొయగాలు..
పచ్చని చెట్ల పాదులపై గొడ్డలి వేటుతో…
ఉలిక్కి పడుతూ, అల్లాడుతున్న అర్థనాధలు
గాలిలో దీపమై ఉగిసలాడుతున్నవి..!!
గుక్కెడు నీళ్లకోసం మొగులు కేసి చూస్తున్న
కోట్లాది రుచిమొగ్గలు,
కార్పొరేట్‌ యంత్రికరణలో కాలుష్య రక్కసి కౌగిలిలో బంధీగా మారిన
పవిత్ర గంగజలాల అంతర్గతం
దాహం తీర్చని దాహపు తోక తప్తహృదయంతో, బరువెక్కిన మానసిక స్థితి
మురికి ప్రవాహపు నరకంలో సేదతీరలేక…
రోగాల కుంపటిలో అల్లాడుతూ
మొక్కని దేవుడు లేడాయే.. తిరగని దావఖానా లేదయే..!
పీల్చే పవనపు అలికిడికి సైతం..
పన్ను కట్టే కాలం రాబోతుందిప్పుడు..
తనను తానే తెలియని నిర్వాకంలోకి నెట్టేసుకొని..
నవ సాంకేతిక ముసుగులో తన నాలుకను తెగ్గోసుకుంటున్న నరుడు…
జ్ఞానం వుండి విచక్షణ కోల్పోతున్న ఆ మనిషి పై జాలి చూపుతూ..
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని విశ్వంభరా..
విపత్తుల సుడిగుండములో పడి కొట్టు మిట్టడుతున్నవేళ…
‘కరోనా’ లాంటి పెనుభూతం వదలకుండా
మనల్ని వేటాడి వెంటాడుతున్న ఈ ఆధునికరణ ఆంక్షలలో..
కర్తవ్యబోధ చెయ్యాలి ఇంకా..
గీతచార్యుడు ప్రభోధించిన
అక్షరాల నుడికరాలకు శ్రీకారం చుట్టాలింకా.!
నిండు పాలపొంగుల ఉప్పొంగిన కాలహృదయమొకప్పుడు
పచ్చని చెట్ల చేనులతో అందియల హరిప్రియ రాగాలు..
నిండు తొణుకుల చెరుకు రసంబు
పూల మధుర ఫల తేనె రసగుల్లలయీ..
ఎగిరే పిట్టల చప్పుల కోలటాలు
నింగి నేల కలయికలో ఎగిసే అలల చుంబనాలు..
నక్షత్ర మెరుపు సంబరాలలో
సంక్రాంతి ముగ్గులయి వన్నెలు చిందుతున్న..
అందమైన రమణీయ కమనీయము
ప్రకృతిని మళ్ళీ సాక్షాత్కారం చేసుకోవాలి.. ఇప్పుడు
మానవ జాతి మేలుకొలుపుకి ఊపిరిలు ఊదే
రేపటి పిల్లన గ్రోవి పిలుపుకై.. బృందావనం అలంబనగా
ప్రేమానురాగాల గళమెత్తి..
శిరస్సున స్వర్ణ మకుటం ధరియించిన ధరిత్రి
పచ్చని మాగాణి సిరుల పంటల..
తుమ్మెద నవ్వుల జలరాసుల
ఉవ్వెత్తు ఆకాశ గంగయి..
మనిషి లోపలి మనస్సుతో ముచ్చటించాలని…
పేరుకుపోతున్న రాగ ద్వేషాలకు తిలోదాలు పలుకాలని…
కలగంటున్నా కలల ఆశల పసిపాప ఆహార్యం..
ఈ ‘భూమి స్వప్నం’..
ఎల్లలు లేని, అరమరిక, అంతరాలు లేని నిస్వార్ధ చింతన సేవలో
ప్రకృతి ప్రేమికుల తొలకరి జల్లులయి కురువాలని..
రాబోవు నూతన మానవ సమాజపు చైతన్యానికి..
భూతల్లి పెదవులపై చిరునవ్వు
పూయించ..
వసుధయిక కుటుంబం కోసం
పరితపిస్తుంది..!
మనమంతా ఒకటిగా చెయ్యి చెయ్యి కలిపి..
నవ నాగరికత నిర్మాణంలో
పాలుపంచుకొందాం.
జీవరాసుల మనుగడకై నేడే ప్రతిన పూనుదాం..!
ధరణి పరిరక్షణకై విశ్వమంతా…
మన జండాలు వేరైనా.. ఒకటే ఎజెండాగా కలిసి నడుద్దాం..!!
– రవీందర్‌ కొండ, 9059237771

Spread the love