చింతలపాలెంలో భూకంపం

నవతెలంగాణ-చింతలపాలెం
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో మళ్లీ భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి 9:50 నిమిషాలకు పది సెకండ్లు కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 2.3గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 2020 నుంచి ఈ ప్రాంతంలో అప్పుడప్పుడూ భూకంపాలు సంభవిస్తన్నాయి. అప్పట్లో ప్రతి రోజూ భూ ప్రకంపనలు వచ్చాయి. మండలంలోని ప్రజలు భూ ప్రకంపనలకు పులిచింతల ప్రాజెక్టు డ్యాం కారణమని భావిస్తున్నారు. ఆనాడు ప్రజలకు పలు సందేహాలు రావడంతో భూ భౌతిక పరిశోధన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో పర్యటించి పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ వల్ల భూ అంతర్భాగంలో పొరలపై భారం పడి ఈ భూకంపాలు సంభవిసున్నాయని తేల్చారు. ఏడాదిన్నరపాటు సుమారు వెయ్యి సార్లు భూకంపాలు వచ్చినట్టుగా భూకంపం లేఖిని (సిస్మోగ్రాఫ్‌)పై నమోదయ్యాయి. కాగా పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 30 టీఎంసీల (45.77) నీటి నిల్వ వుంది.

Spread the love