ఎన్నికల అనంతరం హింసపై ఈసీ ఆగ్రహం

ఎన్నికల అనంతరం హింసపై ఈసీ ఆగ్రహం– నేడు ఢిల్లీకి రావాలని ఏపీ సీిఎస్‌, డీజీపీలకు ఆదేశం
అమరావతి : రాష్ట్రంలోసార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం పలుచోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దయెత్తున హింస చోటుచేసుకోవడం పైనా, హింసాత్మక ఘటనలు పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారం ఉన్నా ఎందుకు నివారించలేకపోయారంటూ ఏపీ సీిఎస్‌, డీజీపీని ఈసీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో తమ ముందు హాజరుకావాలని ఏపీ సీిఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను ఇసి ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా పాలనా వ్యవస్థ, పోలీస్‌ వ్యవస్థల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా, దీపక్‌ మిశ్రా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.కొత్త డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా కేవలం సమీక్షలకే పరిమితమయ్యారని, సీఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయడంలో విఫలమయ్యారని పరిశీలకులు ఈసీకి నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సచివాలయం లో బుధవారం సాయంత్రం సీఎస్‌తో డీజీపీ, ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌ భేటీ అయ్యారు. ఈసీకి గురువారం వివరణ ఇచ్చేందుకు అత్యవసర భేటీ అయ్యారు. హింసాత్మక ఘటనలు జరిగేందుకు బాధ్యులెవరు? తీసుకున్న నివారణ చర్యలేమిటి? అనే విషయాలపై చర్చించినట్లు సమాచారం.
ఆ పోలీసులపై త్వరలో చర్యలు : ఏపీ సీఈఓ
పోలింగ్‌ అనంతర ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్టు గుర్తించామని సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన పోలింగ్‌ అనంతర హింసపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అక్కడక్కడ కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా వ్యవహరించిన వారిని ఇప్పటికే గుర్తించామని ఒక ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పారు. వీరిని ఉపేక్షించేదిలేదని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారినికూడా గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. తాడిపత్రి,మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో ఘటనలకు కారణమైన వారినందరినీ ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. చంద్రగిరి ఘటనకు సంబంధించి ఇప్పటికే 30మందిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారిని మరో 24 గంటల్లోగా అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో సీనియర్‌ అధికారులకు అదపు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో అదనపు సాయుధ బలగాలతో పాటు 144 సెక్షన్‌ విధించడం, స్ధానికంగా రాక పోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు.

Spread the love