నవతెలంగాణ – న్యూఢిల్లీ : కేరళ, యుపి, పంజాబ్‌లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ తేదీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్పులు చేసింది. నవంబర్ 13న జరగాల్సిన పోలింగ్, నవంబర్ 20న జరుగుతుందని తెలిపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుందని ప్రకటించింది. నవంబర్ 13 -15 మధ్య పలు పర్వదినాలను ఉటంకిస్తూ పలు రాజకీయ పార్టీలు పోలింగ్ తేదీని మార్చాల్సిందిగా అభ్యర్థించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పండుగలు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతాయని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. యుపిలో 9, పంజాబ్‌లో నాలుగు, కేరళలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ జరగనుంది.