– నేడు జార్ఖండ్ సీఎం విచారణ
– మంగళవారం మధ్యాహ్నం వరకూ హైడ్రామా
– 30 గంటలకు పైగా కనిపించకుండా పోయిన హేమంత్ సోరెన్
– ఎట్టకేలకు రాంచీలోని తన అధికారిక నివాసంలో ప్రత్యక్షం
– సంకీర్ణ ప్రభుత్వ కూటమిలోని పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం
– హేమంత్ భార్యకు సీఎం పగ్గాలు?
రాంచీ : జార్ఖండ్ సీఎం, జేఎంఎం చైర్‌పర్సన్ హేమంత్ సోరెన్‌ను విచారించటానికి ఈడీ సిద్ధమైంది. ముందుగా పంపిన సమన్ల ఆధారంగానే ఆయనను నేడు ప్రశ్నించటానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విచారణ సందర్భంగా ఈడీ ఆయనను అరెస్టు చేయొచ్చనే వార్తల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకూ హైడ్రామా చోటు చేసుకున్నది. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టు కావచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి తరుణంలో హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. 30 గంటల పాటు ఆయన జాడ తెలియలేదు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం సమయంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని తన అధికారిక నివాసంలో ప్రత్యక్షమయ్యారు. అధికార కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు క్యాబినేట్ మంత్రులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఆయన భార్య కల్పనా సోరెన్ సైతం ఈ సమావేశంలో ఉన్నారు. సీఎం బాధ్యతలను ఆమె చేపట్టవచ్చనే ఊహాగానాలు సైతం వెలువడ్డాయి.
భద్రత కట్టుదిట్టం.. పలు ఆంక్షలు
తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. హేమంత్ సోరెన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంక్షలను విధించారు. ఆయన ఇంటి ముందు మంగళవారం పది గంటల వరకు గుమిగూడటాన్ని నిషేధించారు. సెక్షన్ 144ను విధించారు. దాదాపు 7 వేల మంది పోలీసులు సీఎం ఇంటి ముందు మోహరించారు. అలాగే, రాజ్‌భవన్, రాంచీలోని ఈడీ ఆఫీసు ముందు కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి ఆంక్షలు విధించారు.
మధ్యాహ్నం ప్రత్యక్షం
కనిపించకుండా పోయిన హేమంత్ సొరెన్ మంగళవారం మధ్యాహ్నం తన అధికారిక కారులో వెళ్తూ కనిపించారు. చిరునవ్వు చిందిస్తూ మీడియాకు చేతులు ఊపారు. కాగా, సోమవారం ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో హేమంత్ అక్కడ లేరు. దీంతో ఆయన అరెస్టు కావచ్చనే అనుమానాలు వచ్చాయి. రాంచీకి చేరుకున్న ఆయన.. గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూ వాటికకు వెళ్లారు. అక్కడ గాంధీకి నివాళులు అర్పించారు. కనిపించకుండా వెళ్లటం, తిరిగి రాంచీలోని ఇంటికి చేరుకోవటంపై మీడియా ప్రశ్నలకు హేమంత్ సోరెన్ స్పందిస్తూ.. తాను మీ గుండెల్లో ఉన్నానని అన్నారు. ”మనమంత జాతి పిత (గాంధీ) అడుగుజాడల్లో, ఆయన సిద్ధాంతాలను ఆచరించడానికి సిద్ధమై ఉన్నాం. వారు మన మధ్య జన్మించిడం, మనకు మార్గనిర్దేశనం చేయటం మనకు గర్వకారణం” అని జార్ఖండ్ సీఎం అన్నారు. హేమంత్ సోరెన్ ఈనెల 27న రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. రాంచీలోని తన ఇంటిలో మధ్యాహ్నం ఒంటి గంటకు నేటి విచారణకు ఆమోదం తెలుపుతూ సొరెన్ ఈడీ అధికారులకు ఈమెయిల్ సైతం చేశారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈడీ సమన్లను హేమంత్ సొరెన్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు దాటవేశారు. కాగా, ఢిల్లీలోని హేమంత్ సొరెన్ నివాసానికి ఈడీ బృందం సోమవారం వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి వరకు జేఎంఎం ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు.