వాషింగ్ మెషిన్‌లో భారీ నగదు.. గుర్తించిన ఈడీ

నవతెలంగాణ -హైదనాబాద్: ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద మొత్తంలో నగదును విదేశాలకు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న దర్యాప్తు ఏజెన్సీ ఈడీ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పల ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాతో పాటు హర్యానాలోని కురుక్షేత్రలోని వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. లెక్కాపత్రంలేని రూ.2.5 కోట్ల నగదును గుర్తించగా.. అందులో కొత్త మొత్తాన్ని వాషింగ్ మెషిన్‌లో కనుగొన్నామని ఈడీ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్, రాజనందిని మెటల్స్ లిమిటెడ్, స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, వశిష్ఠ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు పలు కంపెనీలు, వాటి డైరెక్టర్ల కార్యాలయ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్టు ఈడీ తెలిపింది. ఈ కంపెనీల భాగస్వాములుగా విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్ గార్గ్, వినోద్ కేడియా‌తో పాటు పలువురిని ప్రశ్నిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. సోదాల్లో పలు అనుమానిత పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటనలో ఈడీ పేర్కొంది. నగదు తరలింపులో ప్రమేయం ఉన్న సంస్థలకు సంబంధించిన మొత్తం 47 బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశామని ఈడీ అధికారులు వివరించారు. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం దాటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని ఈడీ పేర్కొంది. సోదాలు జరిపిన కంపెనీల భాగస్వాములు సింగపూర్ గెలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హారిజోన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌ కంపెనీలకు అనుమానాస్పద రీతిలో రూ.1,800 కోట్ల మేర చెల్లింపులు చేసినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు వివరించారు. ఈ రెండు విదేశీ సంస్థలను ఆంథోనీ డిసిల్వా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.

Spread the love