దాడులు పెంచిన ఈడీ

ED increased the attacks– ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నేతలపై చర్యలు వేగవంతం
– నిన్న లాలూ, తేజస్వి… నేడు సోరేన్‌
– కేజ్రీ అరెస్ట్‌ తప్పదని వదంతులు
– బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలున్నా పట్టించుకోరు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ముమ్మరం కాబోతున్నాయి. ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయడానికి ఈ దాడులను బీజేపీ ఆయుధాలుగా మలచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏలో చేరిన రెండు రోజులకే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షనేతలే లక్ష్యంగా ఈ డాడులు వేగవంతమవుతున్నాయి. దీంతో దేశంలో రాజకీయ అలజడి చెలరేగుతోంది.
న్యూఢిల్లీ : తాజాగా ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్‌ సొరేన్‌ నివాసానికి చేరుకొని ఆయన్ని ఓ భూ కుంభకోణం కేసులో ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ చేశారు. సొరేన్‌ ఇదంతా తనపై రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈడీ వేటాడుతున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో సొరేన్‌ నాలుగో వారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్‌ బఘేల్‌, ఆయన సన్నిహితులపై ఈడీ పంజా విసిరింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారిపై అక్రమ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసు నమోదు చేసింది. దీనిని బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి అవినీతిపరుడంటూ ఆరోపణలు గుప్పించింది. ఇక బీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కూడా ‘ఉద్యోగాలకు భూమి’ కేసులో ఇరికించింది.
సోరేన్‌ కనబడడం లేదట
జార్ఖండ్‌ ముఖ్యమంత్రి సోరేన్‌కు వ్యతిరేకంగా బీజేపీ దుష్ప్రచారం ప్రారంభించింది. న్యూఢిల్లీలో విచారణకు హాజరు కాకపోవడంతో సోరేన్‌ కనబడడం లేదంటూ ఆయన ఫొటోలతో పోస్టర్లు ముద్రించింది. సొరేన్‌ ఆచూకీ చెబితే రూ.11,000 బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే ఆ మధ్యాహ్నమే సొరేన్‌ తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వెళ్లానని, అంతేకాక రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనలో బిజీగా ఉన్నానని ఆయన చెప్పారు. బుధవారం జరిగిన విచారణకు సైతం ఆయన హాజరవడంతో బీజేపీ నేతల నోళ్లు మూతపడ్డాయి.
లాలూ, తేజస్విపై ప్రశ్నల వర్షం
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కూడా ఈడీ సోమవారం ప్రశ్నించింది. 2004-2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్‌ డీ ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగుల నుండి భూమిని లంచంగా తీసుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌తో పాటు 12 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. తండ్రితో పాటు ఈడీ విచారణకు వచ్చిన ఎంపీ మిసా భారతి విలేకరులతో మాట్లాడుతూ దర్యాప్తునకు సహకరించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసిన ప్పటికీ అనవసరంగా వేధిస్తున్నారని ఆరోపించారు. లాలూను విచారించిన మరునాడే తేజస్విని కూడా ఎనిమిది గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
విచారణ అనంతరం బయటికి వచ్చిన తేజస్వికి పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఇది ఈడీ కార్యాలయం కాదు. బీజేపీ కార్యాలయం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నేతలను ఇక్కడికి పిలిచి ప్రశ్నించడం పరిపాటి అయింది’ అని మండిపడ్డారు.
తృణమూల్‌ నేతలను సైతం…
ప్రజా పంపిణీ పథకంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌ నివాసంపై దాడులు చేశారు. ఇదే కేసులో తృణమూల్‌ మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్‌ను గత సంవత్సరం అక్టోబర్‌ 23న ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ విధంగా పలువురు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. రాజస్థాన్‌ మాజీ మంత్రి మహేష్‌ జోషీ పైన, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల కాంగ్రెన్‌ నేతల పైన ఈడీ కేసులు బనాయించి వేధిస్తోంది.
కేజ్రీని అరెస్ట్‌ చేస్తారా?
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా మద్యం పాలసీ కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, అమ్‌ఆద్మీ ఎంపీ సంజరు సింగ్‌ ఇప్పటికే జైలులో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మరో ఆప్‌ మంత్రి సత్యేంద్ర జైన్‌ గత రెండేళ్లుగా కటకటాలను లెక్కిస్తూ కాలం గడుపుతున్నారు. ఈడీ విచారణకు గైర్హాజరు అవుతున్న కేజ్రీవాల్‌ను కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే తనను ప్రశ్నించాలని ఈడీ భావిస్తోందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని
ఆయన ఆరోపించారు.
బీజేపీ నేతలపై చర్యలేవి?
విచారణల పేరిట ప్రతిపక్ష నేతలపై దూకుడు పెంచుతున్న ఈడీ, బీజేపీ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్దారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై పలు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరకముందు పవార్‌పై కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. అయితే ఆయన కాషాయదళంలో చేరగానే కడిగిన ముత్యమై పోయారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నమోదైన వ్యాపమ్‌ వంటి అనేక పాత కేసులు ఇప్పుడు అటకెక్కాయి. కర్నాటకలో యడ్యూరప్ప, బీఎస్‌ బొమ్మై ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నమోదైన అనేక చిన్న, పెద్ద అవినీతి కేసుల గతీ అంతే. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఈ కేసుల్లో పలువురు మంత్రులు నిందితులుగా ఉన్నారు.
కేసులు సరే…శిక్షలేవి?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్ష నేతలపై పుంఖానుపుంఖాలుగా కేసులు పెడుతున్న ఈడీ, ఆ ఆరోపణలను నిరూపించలేక చతికిలపడుతోంది. ఉదాహరణకు గత సంవత్సరం మార్చి వరకూ ఈడీ 5,906 కేసులు నమోదు చేసింది. అయితే 1,142 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తి చేసి, ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో కూడా 25 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన వాటిలో 24 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. కానీ 2014 నుండి ఈడీ దాఖలు చేసిన కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఈడీ, సీబీఐ పెట్టిన కేసుల్లో 95శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపై పెట్టినవే. అందుకే దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయడానికి బదులు ఈడీ, సీబీఐ నమోదు చేయబోయే కేసుల వివరాలను బీజేపీ నాయకులు ముందుగానే బహిర్గతపరుస్తూ అనుమానాలను మరింత పెంచుతున్నారు.

Spread the love