– పీజీ సీట్లను బ్లాక్‌లో విక్రయించారన్న ఆరోపణలపై కళాశాల అధికారులకు ప్రశ్నలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) సీట్లను బ్లాక్‌లో విక్రయించారన్న ఆరోపణలపై రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి పీజీ కాలేజీలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆరుగురికి పైగా ఈడీ అధికారులు పాల్గొన్నారు. మల్లారెడ్డి పీజీ కాలేజీలో పీజీకి సంబంధించిన సీట్లను కాలేజీ యాజమాన్యం నిర్ణీత ఫీజు కంటే భారీ మొత్తంలో రేట్లను పెంచి అమ్ముకున్నట్టు ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఇందుకోసం, నిర్ణీత కాలంలో ప్రకటించాల్సిన పీజీ సీట్లలో చాలా వరకు నిలుపుదల చేసి గడువు అనంతరం ఆ సీట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలపై ఈడీ అధికారులు నిశితంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యానికి చెందినవారితో పాటు సీట్ల ఎంపికకు సంబంధించిన అధికారులను ఈడీ అధికారులు ఈ సందర్భంగా విచారించినట్టు సమాచారం. అంతేగాక, పీజీ కాలేజీకి సంబంధించిన రికార్డులను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను కూడా స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.