నవతెలంగాణ – హైదరాబాద్: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉదయం నుంచి పటాన్ చెరు పట్టణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పటాన్ చెరు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సోదరుడి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.