ఈడీ ఆకస్మిక సోదాలు

–  తొమ్మిది ప్రయివేటు మెడికల్‌ కాలేజీలలో మెరుపుదాడులు
– మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసి మేనేజ్‌మెంట్‌ కోటాలో భారీ మొత్తంలో అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు
– సదరు కళాశాలల చైర్మెన్లు, డైరెక్టర్లనూ విచారించిన ఈడీ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో వరుసబెట్టి ఒకపక్క ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), మరోపక్క ఆదాయపు పన్ను (ఐటీ) శాఖాధికారులు జరుపుతున్న దాడులు పలువురు రాజకీయ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తాజాగా తొమ్మిది ప్రయివేటు మెడికల్‌ కాలేజీలలో 70 మందికి పైగా ఈడీ అధికారులు, వారి సిబ్బంది బుధవారం మెరుపుదాడులు నిర్వహించటం సంచలనం రేపింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఈ తొమ్మిది ప్రయివేటు మెడికల్‌ కాలేజీలలో ఒకేసారి ఈడీ అధికారులు వ్యూహాత్మకంగా దాడులు జరపటంతో సదరు కాలేజీల యాజమాన్యాలు విస్మయం చెందినట్టు తెలిసింది.
యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదును ఆధారంగా చేసుకొని..
ఈ కాలేజీలలో యాజమాన్యాలు అర్హులైన విద్యార్థులకు చెందాల్సిన మెడికల్‌ సీట్లను ఉద్దేశపూర్వకంగా బ్లాక్‌ చేసి వాటిని తర్వాత మూడో కంటికి తెలియకుండా మేనేజ్‌మెంట్‌ కోటా కింద విక్రయించి కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై గతేడాది కాళోజీ నారాయణరావు మెడికల్‌ యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్‌ జిల్లాలోని మట్వాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును ఆధారంగా చేసుకొనే ఈడీ అధికారులు సదరు కాలేజీలలో ఆకస్మిక సోదాలను నిర్వహించింది.
ఇవే ఆ 9 కాలేజీలు
ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన మెడికల్‌ కాలేజీలలో మంత్రి మల్లారెడ్డి చెందిన మెడికల్‌ కాలేజీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చెందిన కాలేజీలతో పాటు మేడ్చల్‌లోని మెడిసిటి, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌, బొమ్మకల్‌ చల్మెడ ఆనందరావు, కామినేని, ఎస్వీఎస్‌, ప్రతిమా, డెక్కన్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి.
– కాలేజీలలో అడుగడుగునా సోదాలు
ముఖ్యంగా, మంత్రి మల్లారెడ్డికి చెందిన మెడికల్‌ కాలేజీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చెందిన మెడికల్‌ కాలేజీతో పాటు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్‌ మెడికల్‌ కాలేజీ, ఎల్బీ నగర్‌లోని కామినేని మెడికల్‌ కాలేజీలలో అధికారులు పెద్ద సంఖ్యలో వెళ్లి వారి అడ్మినిస్ట్రేషన్‌ భవనంలో అడుగడుగున సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ముఖ్యంగా, ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్లతో పాటు మేనేజ్‌మెంట్‌ విభాగానికి చెందిన అధికారులను కూడా ఈడీ ప్రాథమికంగా ప్రశ్నించినట్టు సమాచారం.
కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం
ఇదే తరహాలోనే ఇతర కాలేజీలలో కూడా సోదాలు నిర్వహించి దాదాపు 41కి పైగా మెడికల్‌ సీట్లను సదరు యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ కోటా కింద అమ్ముకొని కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఈడీ అనుమానిస్తున్నది. ఈ సందర్భంగా ఆయా కాలేజీల కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను, విలువైన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనపర్చుకున్నట్టు తెలిసింది. వీటికి సంబంధించి అవసరమైతే కొన్ని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సోదాల సమయంలో మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వారితో పాటు ఇతర సిబ్బందికి సంబంధించినవారి ఫోన్లను స్వాధీనపర్చుకొని అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Spread the love