నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liqour Scam Case)లో కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇంటికి ఈడీ(ED) అధికారులు చేరుకున్నారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ(ED) బృందం ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్నట్టు సమాచారం.
సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా.. సెర్చ్ వారెంట్‌తోనే వచ్చామని చెప్పినట్టు తెలుస్తోంది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు, మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఈరోజు ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకొని సోదాలు జరుపుతున్నట్టు వస్తోన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.