ఫెమా కేసులో హీరానందానీ ప్రమోటర్లకు ఈడీ సమన్లు

నవతెలంగాణ -హైదరాబాద్: హీరానందానీ గ్రూప్‌ ప్రమోటర్‌ నిర్జన్‌ హీరానందానీ, ఆయన తనయుడు దర్శన్‌ హీరానందానీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న ముంబయిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై సమన్లలో పేర్కొన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. దర్శన్‌ హీరానందాని గత కొద్దిరోజులుగా దుబాయిలో నివాసం ఉంటున్నారు. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ నిబంధనల ప్రకారం గత వారం ముంబయి పరిసర ప్రాంతాల్లో ఈడీ హీరానందానీ గ్రూప్‌కు చెందిన నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిచింది. విదేశీ లావాదేవీలతో పాటు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ ఉన్న ట్రస్ట్‌ లబ్ధిదారులను సైతం ఏజెన్సీ విచారిస్తున్నది. విచారణకు ఈడీకి సహకరిస్తామని హీరానందానీ గ్రూప్ తెలిపింది. ఈడీ దర్యాప్తుతో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు ఎలాంటి సంబంధం లేదని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు లోక్‌సభలో మహువా మొయిత్రా ప్రశ్నలు అడిగినట్లుగా బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఆరోపించారు.

Spread the love