నేడు కేటీఆర్‌ను విచారించనున్న ఈడీ

ED will interrogate KTR today– ‘సుప్రీం’లో క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేతతో మరింత ఆసక్తి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌లో భారీ ఎత్తున నిధుల మళ్లింపునకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనున్నారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తులు తోసిపుచ్చటంతో ఇది మరో మలుపు తిరిగినట్టయ్యింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించారు. అంతేగాక, సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఏసీబీ సైతం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదితో కలిసి చేసిన వాదనకు అక్కడ బలం చేకూరినట్టయ్యింది. అదే సమయంలో, ఏసీబీ సైతం కేటీఆర్‌ను విచారించటానికి మరోమారు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ కేటీఆర్‌ను విచారిస్తున్న సందర్భంలో ఎలాంటి విషయాలు ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌కు సంబంధించి వెలుగు చూస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా రూ.46 కోట్ల మేరకు హెచ్‌ఎండీఏ నుంచి ఈ-కార్‌ రేస్‌ నిర్వహణకు సంబంధించి లండన్‌కు చెందిన ఎఫ్‌ఈఓ కంపెనీకి బదిలీ చేసే సమయంలో వాటిని పౌండ్ల రూపంలో మార్చినపుడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోకపోవటంపై ఈడీ ప్రత్యేక దృష్టిని సారించనున్నట్టు తెలిసింది. ఈ కారణం చేత ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానాను విధించటం పైనా కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్టు సమాచారం.
అలాగే, ఇప్పటికే ఈ కేసులో రెండో, మూడో నిందితులైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ఈడీ ప్రశ్నించింది. వారిచ్చిన సమాచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశమున్నదని తెలిసింది. మొత్తమ్మీద, కేటీఆర్‌కు ఈడీ నుంచి కొన్ని కఠినమైన ప్రశ్నలే ఎదురు కానున్నాయని సమాచారం. కాగా, కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించనున్న నేపథ్యంలో విచారణ సంస్థ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Spread the love