ఈడీ అధికారాలకు కళ్లెం

ED's powers– ఏకపక్ష అరెస్టులు చెల్లవు
– కోర్టు అనుమతి తప్పనిసరి
– సమన్లు జారీ అయితే కస్టడీ కుదరదు
– మనీ లాండరింగ్‌ కేసులో సుప్రీం చారిత్రాత్మక తీర్పు
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌ కేసులో నిందితులను ఏకపక్షంగా, ఎడాపెడా అరెస్టు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈడీ అధికారాలకు కళ్లెం వేస్తూ, అరెస్టుకు న్యాయస్థానం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత నిందితుడిని అరెస్ట్‌ చేసే హక్కు ఈడీకి లేదని తేల్చి చెప్పింది. ఫిర్యాదు దాఖలు చేసే వరకూ నిందితుడిని అరెస్ట్‌ చేయకపోతే ఆ తర్వాత కూడా చేయకూడదని రూలింగ్‌ ఇచ్చింది.
మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 19 కింద నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఉన్న హక్కులను సుప్రీంకోర్టు కుదించింది. నేరాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకొని నిందితుడికి సమన్లు జారీ చేసిన పక్షంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం అతనిని అరెస్ట్‌ చేసేందుకు ఈడీకి, దాని అధికారులకు అధికారాలేవీ ఉండవని అత్యున్నత న్యాయస్థానం గురువారం తన చారిత్రాత్మక తీర్పులో స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి తప్పు చేశాడని తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా కానీ లేదా ఏ ఇతర కారణాలతో అయినా కానీ విశ్వసిస్తే పీఎంఎల్‌ఏలోని సెక్షన్‌ 19 కింద ఈడీ అధికారులు అతనిని అరెస్ట్‌ చేయవచ్చు. ఈ సెక్షన్‌లోని మరో కీలకమైన అంశమేమిటంటే అరెస్టు చేయడానికి కారణాలను సాధ్యమైనంత త్వరగా ఆ వ్యక్తికి తెలియజేయాల్సి ఉంటుంది. దీనిపై సుప్రీంకోర్టు వివరణ ఇస్తూ అలాంటి సందర్భాలలో ఈడీ ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
అరెస్టుపై వివరణ
ఫిర్యాదు దాఖలు చేసే వరకూ నిందితుడిని ఈడీ అరెస్ట్‌ చేయకపోతే ఆ తర్వాత కూడా అరెస్ట్‌ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక న్యాయస్థానం ముందుగా సమన్లు జారీ చేయాలని, దానికి నిందితుడు తగిన సమాధానం ఇస్తే అతను ‘కస్టడీ’లో ఉన్నట్లు భావించరాదని తెలిపింది. ‘నిందితుడికి సమన్లు జారీ చేసిన తర్వాత అతనిని కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ భావిస్తే ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
కస్టడీలో విచారణ అవసరమని కోర్టు భావించినప్పుడు మాత్రమే అందుకు అనుమతి ఇవాల్సి ఉంటుంది’ అని జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భయాన్‌తో కూడిన బెంచ్‌ పేర్కొంది. సమన్లకు సమాధానం ఇవ్వడంలో నిందితుడు విఫలమైనప్పుడే సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 70 ప్రకారం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేయాలని, అది కూడా ముందు బెయిలబుల్‌ వారంట్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది.
అధికారాలపై ఆంక్షలు
ఏకపక్షంగా అరెస్ట్‌ చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థను నిలువరించేందుకు ఈ చారిత్రక తీర్పు ఉపయోగపడుతుంది. కోర్టు జారీ చేసే సమన్లకు సమాధానం ఇవ్వకముందే నిందితులను అరెస్ట్‌ చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం నిందితుడు తప్పు చేయలేదని భావించినప్పుడు, బెయిల్‌ ఇస్తే ఇదే తరహా నేరం సహా నేరాలేవీ చేయబోడని విశ్వసించినప్పుడు మాత్రమే మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్‌ లభిస్తుంది. ‘ఈ రెండు పరీక్షలకు’ నిందితుడు నిలిచినప్పుడే న్యాయస్థానం బెయిల్‌ ఇస్తుంది.
ఒక మనీ లాండరింగ్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఆ కేసులో సమన్లు జారీ కావడంతో నిందితుడు కోర్టు ఎదుట హాజరయ్యాడు. ప్రత్యేక న్యాయస్థానం నేరాన్ని పరిగణనలోకి తీసుకున్న పక్షంలో బెయిల్‌ మంజూరు చేయడానికి నిందితుడు ఈ రెండు పరీక్షలకు నిలిచాడా అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గత నెల 30న తీర్పును రిజర్వ్‌ చేసింది.
గతంలో ఏం చెప్పిందంటే…
కాగా ఎలాంటి మినహాయింపులు లేకుండా నిందితుడి అరెస్టుకు ఈడీ లిఖితపూర్వకంగా కారణాలు చూపాల్సి ఉంటుందంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు రెండు నెలల క్రితం తిరస్కరించింది. సమీక్షించడానికి తన తీర్పులో తప్పులేవీ లేవని స్పష్టం చేసింది. సెక్షన్‌ 50 ప్రకారం సమన్లు జారీ చేసినప్పుడు సాక్షి సహకరించలేదన్న ఏకైక కారణంతో సెక్షన్‌ 19 కింద అతను లేదా ఆమెను అరెస్ట్‌ చేయరాదని ఆ సందర్భంగా న్యాయస్థానం తెలిపింది.

Spread the love