– ‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరటే
– క్లీన్‌చిట్ ఇవ్వని దర్యాప్తు సంస్థ
– పూర్తికాని విచారణ
– అన్ని ఆప్షన్లూ బీజేపీ వద్దే
– అడకత్తెరలో పోకచెక్కలా ఏపీ సీఎం
న్యూఢిల్లీ : ఈడీ అధికారులు ఈ నెల 15వ తేదీన హైదరాబాదులో రూ.23.54 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశారు. ఇవి సీమెన్స్ ఇండిస్టీ సాఫ్ట్‌వేర్ అండ్ డిజైన్‌టెక్ సిస్టమ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు చెందిన ఆస్తులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణానికి సంబంధించి ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ కేసులోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం 53 రోజులు జైలులో గడిపారు. ఇదంతా గత చరిత్ర. అయితే రూ.371 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నదా లేదా అనే విషయంపై ఈడీ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. దర్యాప్తు సంస్థ నుండి అధికారిక ప్రకటన ఏదీ విడుదల కానప్పటికీ పలు మీడియా సంస్థలు, సీనియర్ పాత్రికేయులు ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చారు.
అయితే ఇదంతా బీజేపీ ‘వాషింగ్ మిషన్’ వ్యూహంలో భాగమేనని కొందరు విమర్శకులు వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి కేసులు ఎదుర్కొంటున్న నాయకులు ఎన్డీఏలో చేరగానే పునీతులవుతున్నారని, వారిపై ఉన్న కేసులన్నీ అటకెక్కుతున్నాయని వారు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
ఏమిటీ కేసు?
తాను రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశానని ఈడీ ఓ పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. అయితే చంద్రబాబు పేరును అందులో ప్రస్తావించలేదు. అదే సమయంలో ఆయన ప్రమేయంపై నిర్ధారణకు వచ్చానని కూడా చెప్పలేదు. 2002వ సంవత్సరపు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సీమెన్స్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులు జప్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కోసం ఉద్దేశించిన నిధులను దుర్వినియోగం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే ఆస్తుల జప్తు జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 కాలంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టును చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం దీనిని ఉద్దేశించారు. అయితే దీనికి కేటాయించిన రూ.371 కోట్ల నిధులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. పరికరాలు, సేవల పేరుతో సిమెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు, కొందరు కీలక వ్యక్తులు నిధులను పక్కదారి పట్టించారన్నది ప్రధాన అభియోగం.
ఈడీ ప్రకటనలో ఏముంది?
ఈడీ పత్రికా ప్రకటన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు ప్రమేయంపై ఈడీ మౌనం వహించడం అంటే ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పడమేనని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈడీ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతోంది ఏమిటంటే…ఇప్పటి వరకూ జరిగిన విచారణలో చంద్రబాబు ప్రమేయం ఏమీ కన్పించలేదని ఈడీ చెప్పింది. అదే సమయంలో విచారణ పూర్తయినట్లు ఆ ప్రకటనలో తెలుపలేదు. ఎన్డీఏతో దోస్తీ కారణంగానే చంద్రబాబుకు ఈ కుంభకోణంలో తాత్కాలిక ఊరట లభించి ఉండవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి నుండి బాబు బయటికి వస్తే పరిస్థితిలో మార్పు రావచ్చునని కూడా వారు చెప్పారు.
‘వాషింగ్ మిషన్’ వ్యూహం
గడచిన దశాబ్ద కాలంలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ పావులుగా వాడుకున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. బీజేపీతో చేయి కలపడమో లేదా చట్టపరంగా సవాళ్లను ఎదుర్కోవడమో తప్ప ప్రతిపక్ష నేతలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరిన తర్వాతే వారిపై కేసుల విచారణ నెమ్మదించింది. కేసులు పూర్తిగా అటకెక్కిన ఉదంతాలూ ఉన్నాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై నమోదైన ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసు విచారణ ఆయన బీజేపీలో చేరగానే నిలిచిపోయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌పై నమోదైన సహకార బ్యాంక్ కుంభకోణం కేసు సైతం ఆయన బీజేపీ శిబిరంలోకి రాగానే కోల్డ్‌స్టోరేజీలో చేరింది. ఒకప్పటి టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిపై దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులు సైతం వారు బీజేపీ పంచన చేరగానే నీరుకారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డిపై ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని చూసి నత్త కూడా సిగ్గు పడుతోంది. జగన్ ఎన్డీఏకు ‘అనధికారిక భాగస్వామి’గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
చక్రబంధంలో చంద్రబాబు
కేంద్రంలో చంద్రబాబు కింగ్‌మేకర్ అని, మోడీ దూకుడుకు ఆయన కళ్లెం వేస్తారని రాజధానిలోని పలువురు పరిశీలకులు తొలుత భావించారు. అయితే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు కేంద్ర నిధులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు ఏటా రూ.1.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో మోడీని ప్రసన్నం చేసుకోవడం మినహా చంద్రబాబుకు మరో దారి లేకుండా పోయింది. తిరుపతి లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయడం ద్వారా బీజేపీ ఇప్పటికే ఏపీలో పునాదులు వేసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీకి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ‘సనాతన ధర్మం’ వాదాన్ని తలకెత్తుకున్నారు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేవే. ఈడీ కేసు విచారణను సజీవంగా ఉంచడం ద్వారా చంద్రబాబును, టీడీపీని బీజేపీ అదుపులో ఉంచవచ్చు. ఏదేమైనా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
టీడీపీ సైతం…
ఆశ్చర్యకరమైన విషయమేమంటే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించడం. పార్టీ ప్రతినిధులు అప్పుడప్పుడు చంద్రబాబు నిర్దోషిత్వాన్ని గురించి చెబుతున్నప్పటికీ ఈడీ ప్రకటన తర్వాత విజయోత్సవ పత్రికా గోష్టులు, సమావేశాలు జరగలేదు. ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ స్పష్టం చేయకపోవడమే దీనికి కారణం. మున్ముందు జరిగే విచారణలో చంద్రబాబు ప్రమేయం బయటపడినా, లేదా విచారణ కొత్త రూపు తీసుకున్నా ఇబ్బందులు తప్పవన్న భావనతోనే టీడీపీ ఎలాంటి సంబరాలు జరుపుకోలేదు.