ఎడ్‌సెట్‌లో అమ్మాయిలదే హవా

98.18 శాతం మంది ఉత్తీర్ణత
– ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఎడ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 27,495 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. 26,994 (98.18 శాతం) మంది అభ్యర్థులు ఉతీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలు హవా కొనసాగించారు. ఎక్కువ మంది దరఖాస్తు చేయడంలోనూ, అర్హత సాధించడంలోనూ వారే ముందంజలో ఉన్నారు. ఎడ్‌సెట్‌లో 25,716 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 22,400 మంది పరీక్ష రాశారు. వారిలో 21,935 (97.92 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 6,009 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 5,095 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 5,059 (99.29 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బీఎడ్‌ కోర్సులో 80 శాతానికిపైగా అమ్మాయిలే విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు సకాలంలో రాకపోవడంతో అబ్బాయిలు ఎక్కువ మంది ఎడ్‌సెట్‌ రాసేందుకు విముఖత చూపిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ర్యాంకు కార్డుల కోసం https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.
గొల్ల వినీష టాపర్‌
ఎడ్‌సెట్‌ ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా తాండూర్‌కు చెందిన గొల్ల వినీష టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్‌ జిల్లా బేగంపేటకు చెందిన నిషాకుమారి రెండో ర్యాంకు, ఎం సుశీ మూడో ర్యాంకును పొందారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన వాసాల చంద్రశేఖర్‌ నాలుగో ర్యాంకును సాధించారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ఆకోజు తరుణ్‌ చంద్‌ ఐదో స్థానం పొందారు.
బీఎడ్‌లో మిగులుతున్న సీట్లు
ఏటా బీఎడ్‌ కోర్సులో సీట్లు మిగులుతున్నాయి. గత విద్యాసంవత్సరంలో 211 బీఎడ్‌ కాలేజీల్లో కన్వీనర్‌, యాజమాన్య కోటా కలిపి మొత్తం 18,350 సీట్లున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి వివరించారు. వాటిలో 13,756 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. 4,594 సీట్లు మిగిలిపోయాయని అన్నారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాత ఎడ్‌సెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ వీసీ సిహెచ్‌ గోపాల్‌రెడ్డి, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఎ రామకృష్ణ, కోకన్వీనర్‌ పి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు 6,009 25,716 31,725
పరీక్షకు హాజరు 5,095 22,400 27,495
ఉత్తీర్ణులు 5,059 21,935 26,994
శాతం 99.29 97.92 98.18
ఎడ్‌సెట్‌ టాపర్ల వివరాలు ర్యాంకు పేరు జిల్లా
1 గొల్ల వినీష వికారాబాద్‌
2 నిషా కుమారి హైదరాబాద్‌
3 ఎం సుశీ హైదరాబాద్‌
4 వాసాల చంద్రశేఖర్‌ జగిత్యాల
5 ఆకోజు తరుణ్‌ చంద్‌ పెద్దపల్లి
6 తొంపుల ప్రశాంత్‌ ఆదిలాబాద్‌
7 మహమ్మద్‌ షరీఫ్‌ సీ రంగారెడ్డి
8 కుసుమ వినరుకుమార్‌ కోనసీమ (ఏపీ)
9 మోటపోతుల అరుణ్‌కుమార్‌ ములుగు
10 ఎ లక్ష్మిగాయత్రి హైదరాబాద్‌

Spread the love