నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్, డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎడ్సెట్ ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, పరిశీలన, ఫీజు చెల్లింపునకు సంబంధించిన వివరాలను బుధవారం నుంచి ఈనెల 30 నమోదు చేయాలి. ధ్రువపత్రాల పరిశీలనకు స్కాన్ చేసిన వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఎన్సీసీ, సీఏపీ, వికలాంగులు, క్రీడల అభ్యర్థులకు సంబంధించి భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 25 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. వచ్చేనెల మూడు నుంచి ఐదు వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేయాలి. ఆరున వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశముంటుంది. తొమ్మిదిన మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. వచ్చేనెల పది నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలి. వచ్చేనెల 30న బీఎడ్ అభ్యర్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. పీఈసెట్ ప్రవేశాలకు సంబంధించి ఈనెల 20 నుంచి 25 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, పరిశీలన, ఫీజు చెల్లింపు వివరాలు అందుబాటులో ఉంటాయి. 24, 25 తేదీల్లో ఎన్సీసీ, సీఏపీ, వికలాంగులు, క్రీడల అభ్యర్థులకు భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 28, 29 తేదీల్లో వెబ్ఆప్షన్లను నమోదు చేయాలి. 30న ఆప్షన్ల సవరణకు అవకాశముంటుంది. వచ్చేనెల మూడున మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నాలుగు నుంచి ఏడు వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి. వచ్చేనెల 30 నుంచి డీపీఈడీ, బీపీఈడీ తరగతులు ప్రారంభమవుతాయి.