– చట్టం ఒకటే అయినా అందరికీ సమానంగా లేదు : రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్
– జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఓయూలో సెమినార్
నవతెలంగాణ-ఓయూ
విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని, చట్టాలు అందరికీ సమానమేనని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ, ఆంధ్ర మహిళా సభ డిగ్రీ ఉమెన్స్ కళాశాల ఆధ్వర్యంలో ‘విద్యా, వైద్య రంగాలు – సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. దేశంలో ప్రైమరీ స్కూల్స్‌పై ఇప్పటికీ ప్రభుత్వాలకు, ప్రజలకు స్పష్టత లేదన్నారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని, అందుకనుగుణంగా పాఠ్యపుస్తకాలను రూపొందించేలా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు అశాస్త్రీయ పద్ధతులను పాటించడం ఎంటని ప్రశ్నించారు. యువత ఎక్కువగా సాంకేతిక విద్య పట్ల ఆసక్తి చూపుతోందని, ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. సామాజిక అంశాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఆర్ట్స్, సైన్స్ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. చట్టం ఒక్కటే అయినా అది అందరికీ సమానంగా అందడం లేదని, సమాజంలో పేదలకు సరైన న్యాయం అందడం లేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. పేదలకు ఒకలా, ధనవంతులకు మరోలా న్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ విరించి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కానీ ప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయని అన్నారు. చిన్న చిన్న రోగాలకు సైతం పేదలు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్కార్ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వర రావు, టి. శ్రీనాథ్, రాష్ట్ర నాయకులు వెంకటరమణారెడ్డి, జితేందర్, చెలిమెల రాజేశ్వరరావు, ప్రొఫెసర్ బి.యన్.రెడ్డి, డాక్టర్ రమాదేవి, ఎస్పీ లింగస్వామి, రవీంద్రబాబు, భీమేశ్వర్, ఆంధ్ర మహిళా సభ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి. రజిని, ప్రిన్సిపాల్ డాక్టర్ ఝాన్సీ రాణి, అధ్యాపకులు కరుణ, వసుంధర, సంధ్యారాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.