విద్యారంగం అస్తవ్యస్తం

– రాష్ట్రంలో అంతా ఇన్‌చార్జీల పాలనే..
– 612 మండలాలకు 596లో ఎంఈవోలు లేరు
– 73 మండలాలకు పోస్టులే లేవు

– 64 డిప్యూటీ ఈవో పోస్టులు ఖాళీ
– 7 జిల్లాల్లోనే రెగ్యులర్‌ డీఈవోలు

– 21 జిల్లాలకు మంజూరు కాని పోస్టులు
– కుంటుపడుతున్న విద్యాప్రమాణాలు

రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రభుత్వం పది నుంచి 33కు పెంచింది. కానీ విద్యాశాఖలో మాత్రం కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేయకపోవడం గమనార్హం. అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 12 డీఈవో పోస్టులే ఉన్నాయి. వాటిలోనూ ఏడు జిల్లాల్లోనే రెగ్యులర్‌ డీఈవోలు పనిచేస్తున్నారు. అంటే 33 జిల్లాల్లో 26 జిల్లాలకు ఇన్‌చార్జీ డీఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ ఈవోకు సంబంధించి 66 పోస్టులుంటే ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌. మిగిలిన 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే అక్కడా ఇన్‌చార్జీలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలి
విద్యావ్యవస్థలో పర్యవేక్షణ పూర్తిగా కుప్పకూలింది. 17 ఏండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయడం లేదు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేయలేదు. డిప్యూటీఈవో, ఎంఈవో పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జీలతోనే పాలన సాగుతున్నది. పర్యవేక్షణ వ్యవస్థ కుప్పలిపోవడం వల్ల ఉపాధ్యాయులకు అకడమిక్‌ గైడెన్స్‌ ఇచ్చే వారు లేరు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గణాంకాల సేకరణ కోసమే వారు పనిచేస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలను పెంచడం కోసం కాదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో లోపం జరుగుతున్నది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలి. అప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.
– చావ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి
బడుల్లో సజావుగా చదువులు జరిగేలా పర్యవేక్షించే అధికారులు కరువయ్యారు. రఎంఈవోల పరిస్థితి చెప్పనక్కరలేదు. 612 మండలాలుంటే 539 మండలాలకే ఎంఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే 73 మండలాలకు ఎంఈవో పోస్టులనే మంజూరు చేయలేదు. 539లోనూ 16 మందే రెగ్యులర్‌ ఎంఈవోలు పనిచేస్తున్నారు. అంటే ఎంఈవో పోస్టులు మంజూరు చేయని మండలాలతో కలిపి 596 మండలాల్లో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యాశాఖ మొత్తం ఇన్‌చార్జీలమయంగా మారింది. అందులోనూ ఒక్కో ఇన్‌చార్జీ ఎంఈవో రెండు నుంచి 12 మండలాల వరకు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉన్నది. డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులన్నీ ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఈ కారణంగా విద్యాప్రమాణాలు కుంటుపడుతున్నాయి. ఉపాధ్యాయుల పనితీరు, బోధన ప్రక్రియ ఎలా సాగుతున్నదో పర్యవేక్షించే అవకాశమే లేదంటూ పలువురు అధికారులు వాపోతున్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభమైనా సమీక్ష ఏదీ?
కొత్త విద్యాసంవత్సరం (2023-24) గతనెల 12 నుంచి ప్రారంభమైంది. నెలరోజులు గడిచినా విద్యారంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించలేదు. ఇది విమర్శలకు తావిస్తున్నది. విద్యారంగం పరిస్థితి, ఉపాధ్యాయుల సమస్యలు, పర్యవేక్షణ వ్యవస్థ, విద్యార్థుల ఇబ్బందులు, సకాలంలో పుస్తకాలు, యూనిఫారాలు అందజేయడం వంటి వాటిపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన సీఎం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. బదిలీలు, పదోన్నతుల్లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి హైకోర్టులో కేసు వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దానిపై కేంద్రీకరించి కోర్టు అనుమతి పొందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు విద్యాశాఖపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని ఈనెల ఏడున హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి మంత్రి కేటీఆర్‌ హాజరు కాలేదు. దీంతో ఆ సమావేశం పూర్తిస్థాయిలో అన్ని అంశాలనూ చర్చించకుండానే ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడి’ కార్యక్రమం సైతం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. తొలిదశలో చేపట్టిన 9,123 బడుల్లో పనులు పూర్తి కాలేదు. నిధుల కొరతతో కొన్ని బడుల్లో ఇంకా పనులే ప్రారంభం కాలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే కేసీఆర్‌ మనవడు హిమాన్షు కేశవనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఆ బడి పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చాయంటూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉందంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. అయినా వాటి బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. మరోసారి టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యావాలంటీర్లను తీసుకోవడానికి కూడా కసరత్తు చేయడం లేదు. దీంతో సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనీ, ఆలస్యమైతే విద్యావాలంటీర్లను నియమించాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.
విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారుల పోస్టుల వివరాలు
పోస్టు మంజూరైనవి పనిచేస్తున్నది ఖాళీలు
ఎంఈవో 539 16 523
డిప్యూటీ ఈవో 66 2 64
డీఈవో 12 7 5
డైట్‌ ప్రిన్సిపాళ్లు 10 4 6
డైట్‌ లెక్చరర్స్‌ 206 17 189
డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్‌ 70 00 70
ప్రొఫెసర్లు 9 5 4
గ్రేడ్‌-1 హెచ్‌ఎం 16 1 15
గ్రేడ్‌-2 హెచ్‌ఎం 440 197 243
ఐఏఎస్‌ఈ/సీటీఈ
ప్రిన్సిపాల్‌ 4 3 1
ఎస్సీఈఆర్టీ/ఐఏఎస్‌ఈ, సీటీఈ లెక్చరర్‌ 95 1 94
ప్రభుత్వ వ్యాయామ కాలేజీ లెక్చరర్‌ 30 0 30
మొత్తం 1497 253 1244
బొల్లె జగదీశ్వర్‌

 

Spread the love