– కాలేజీ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
– లెక్చరర్‌ను కాపాడే ప్రయత్నంలో కళాశాల సిబ్బంది!
– సదరు లెక్చరర్‌పై గతంలో పలు ఫిర్యాదులు
– వెస్ట్ మారేడుపల్లిలోని ఓ కళాశాలలో ఘటన
నవతెలంగాణ-సిటీబ్యూరో/ కంటోన్మెంట్
విద్యాబుద్ధులు చెప్పి.. సత్ప్రవర్తనతో ఆదర్శంగా నిలవాల్సిన అధ్యాపకులు కొందరు దారి తప్పుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకోవాల్సిన కొంతమంది గురువులు వారిపట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక కళాశాల, పాఠశాలల్లో జరుగుతున్నా.. వాటిని బయటకు పొక్కకుండా ఈ కీచకులు జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఓ కళాశాలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో విద్యాశాఖ(ఇంటర్) అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది సదరు అధ్యాపకుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అసలేం జరిగింది..!
సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఓ కళాశాలలో సదరు అధ్యాపకుడు ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు.. ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిని సన్నద్ధం చేస్తున్నారు. ప్రతిరోజూ గంటపాటు స్టడీ అవర్ పేరిట క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం(15వ తేదీన) సాయంత్రం 4 గంటలకు స్టడీ అవర్ జరుగుతుండగా.. ఆ అధ్యాపకుడు సెకండియర్ సీఈసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఆదివారం సెలవు కావడంతో సదరు బాలిక తల్లి, బంధువులు సోమవారం ఉదయం కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో ఉన్న ప్రిన్సిపాల్ విషయం తెలుసుకుని విద్యార్థిని పేరెంట్స్‌తో మాట్లాడి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. సీసీ కెమెరాలు చెక్ చేసి.. ఏం జరిగిందో తెలుసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమిస్తానని, ఇందుకు మరో 24గంటల పాటు సమయం ఇవ్వాలని ప్రిన్సిపాల్ చెప్పినట్టు తెలిసింది. దాంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే, ప్రిన్సిపాల్ సదరు అధ్యాపకుడినే వెనకేసుకు రావడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. బాలిక పేరెంట్స్‌తో ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సమస్య పెద్దది అవుతుండటంతో సదరు అధ్యాపకుడు ఒక కీలక అధికారిని కలిసి.. డబ్బులు ఇస్తానని, తనను ఇందులో నుంచి బయట పడేయాలని ప్రాథేయపడినట్టు సమాచారం. దీంతో సదరు అధికారి రంగంలోకి దిగి అన్నీ సెట్ చేయడంతోనే ప్రిన్సిపాల్, సిబ్బంది ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలిసింది.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, మీడియా ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించగా.. ఫిర్యాదు నిజమే అని చెబుతూ.. నిజనిజాలు నిర్ధారించుకున్న తర్వాతే విషయంపై మాట్లాడతానని వివరించారు. అయితే, గతంలోనూ ఆ అధ్యాపకుడు బాలికలపై అసభ్యంగా ప్రవర్తించారని సమాచారం. రాత్రి 8, 9 గంటల వరకు కూడా ఈ అధ్యాపకుడు కళాశాలలోనే ఉండేవారని, రాత్రిపూట పార్టీలు చేసుకుంటారని తెలిసింది. క్లాస్‌రూంలో ద్వంద్వ అర్థాలతో మాట్లాడుతూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాడని ఫిర్యాదులు ఉన్నాయి. బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.