ఓటుపై పడిన ‘నోటు’ ప్రభావం

– అసెంబ్లీతో పోల్చుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో దగ్గిన పోలింగ్‌ శాతం
ప్రచారంలోనూ ఉత్సాహం చూపని రాజకీయ పార్టీలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నవతెలంగాణ రాసిన మన్నెంలో జాడలేని ఎన్నికల ఉత్సాహం నేడు వాస్తవమని రుజువైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికలలో చూపిన అనాసక్తి ఓటర్ల పై కూడా పడింది. మండే వేసవిలో సైతం గత పది రోజులుగా వాతావరణంలో వచ్చిన అనుహ్య మార్పులతో ఎన్నికలకు ప్రకృతి సహకరించి చల్లబడ్డప్పటికీ ఓటర్‌ దేవుళ్ళు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం నియోజకవర్గం పరిధిలో దాదాపు 80% పోలింగ్‌ నమోదు కాగా పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 65 శాతానికే పోలింగ్‌ పడిపోవటం చూస్తుంటే పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ప్రచార శైలిలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఒకవైపు ఫిరాయింపులు చేరికలతో పాటు భారీ బల ప్రదర్శనలు తోడు ఓటర్లను ఆకట్టుకుండేందుకు రాజకీయ పార్టీలు పడని తిప్పలు లేవు. కానీ పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం పోలింగ్కి మూడు రోజులు ముందు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేసే తప్ప పూర్తిస్థాయిలో ఓటర్లను కలిసిన పాపాన్ని కూడా పోలేదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఉన్న మానుకోట పార్లమెంటు పరిధిలోని భద్రాచలం నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల తీరును చూస్తే ఎక్కడో అభ్యర్థికి ఇక్కడ ప్రచారం ఎందుకు అన్నట్టుగా వ్యవహార శైలి కనిపించింది.
ఓటుపై పడిన నోటు ప్రభావం..?
పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడిన నాటి నుండి ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో ఆ స్థాయిలో ప్రచార శైలి మాత్రం కనిపించలేదు. ప్రచారానికి కావలసిన ఖర్చుల విషయంలో అభ్యర్థులు వెనుకడుగు వేయడంతోనే పార్టీల దగ్గర ప్రచారం జరగలేదని విమర్శలు వినిపించాయి. మారుతున్న రాజకీయాలలో నిస్వార్ధంగా జెండాలు పట్టే కార్యకర్తలు కరువైపోయిన తరుణంలో కూలిస్తే గాని జెండా పట్టని పరిస్థితులలో ఖర్చులకు అభ్యర్థులు వెనకడుగు వేయడంతోనే ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలకి మూడు నాలుగు రోజులు ముందు మాత్రమే ప్రచారం నిర్వహించారని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పటా పోటీన ఓటర్లకు డబ్బులు పంచిన నేపథ్యంలో గతంలో ఓటుకు రూ.500 ఇచ్చిన రాజకీయ పార్టీలు ఆ రేటు భారీగా తగ్గించి కేవలం ఒక పార్టీ వంద మరో పార్టీ రూ.250 మాత్రమే ఇయ్యటంతో ఓటర్లు పోలింగ్‌పై ఆసక్తి చూపలేదని అర్థమవుతుంది. అభ్యర్థులు పంపించిన అరకొర డబ్బులు కూడా బూత్‌ ఇన్‌చార్జిలు సగం మేర స్వాహా చేసి కొంతమేరే పంచుతున్నారని ఆరోపిస్తూ ఓటర్లు ఆ బూత్‌ బాధ్యుల ఇండ్ల ముందు గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిధుల కొరతతో ఇటు ప్రచారంలోనూ అటు కొనుగోలు లోను రాజకీయ పార్టీలు చూపిన నిర్లక్ష్య ఫలితంగా ఈసారి భారీ స్థాయిలో పోలింగ్‌ శాతం తగ్గిందని తెలుస్తుంది.
ఆంధ్ర విలీన మండలాలలో భారీగా పోలింగ్‌…
పూర్వపు భద్రాచలం డివిజన్లో అంతర్భాగంగా ఉన్న ఎట్టపాక, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలలో అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌ సుమారు 85% పోలైంది. భద్రాచలాని ఆనుకొని మండలంలో సైతం ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు బార్లు తేరి కోలాహలంగా కనిపించింది. ఆంధ్రాలో ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీన ప్రచారం నిర్మించడమే కాక ఓటర్లను కూడా అదే స్థాయిలో ప్రసన్నం చేసుకున్నారని ఆ ఫలితంగానే ఆంధ్రాలో భారీగా పోలింగ్‌ నమోదయిందని దానికి భిన్నంగా తెలంగాణలో మాత్రం అతి తక్కువ పోలింగ్‌ అవ్వటానికి కూడా ప్రధానంగా నోటే కారణమని స్పష్టమైంది.

Spread the love